`పుష్ప` సేఫ్ జోన్‌లో లేదా?

Wed Dec 08 2021 13:01:54 GMT+0530 (IST)

Cross that mark if Pushpa to be safe

`అల వైకుంఠపురములో` అనూహ్యంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో బన్నీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ ఎఫెక్ట్ ఈ మూవీ తరువాత చేస్తున్న `పుష్ప`పై పడింది. దాంతో ఈ మూవీపై ప్రారంభం నుంచే భారీ క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్‌కి తగ్గట్టుగానే బయ్యర్స్ ఈ మూవీ రైట్స్ కోసం ఎగబడ్డారు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ కంప్లీట్ చేసుకుంది.బన్నీ - సుకుమార్‌ల కాంబినేషన్ కావడం కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. దానికి తోడు `అల వైకుంఠపురములో` నాన్ బాహుబలి రికార్డుని దక్కించుకోవడం కూడా `పుష్ప`కు బాగా కలిసి వచ్చింది.

దీంతో `పుష్ప` చిత్రానికి ఎవరూ ఊహించని స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద `పుష్ప` ఏ స్థాయి సంచలనాలకు తెరలేపుతుందా అని రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` రాధేశ్యామ్ ఫిబ్రవరిలో రానున్న `ఆచార్య` టీమ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే `పుష్ప` ప్రీ రిలీజ్ బిజినెస్ సంచలనం సృష్టిస్తోంది.

దాదాపుగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 135 కోట్లుగా చెబుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన డీల్ 110 కోట్లకు క్లోజ్ అయింది. ఒక్క నైజాం రైట్స్ కే 40 కోట్లు వచ్చాయంటే `పుష్ప` ఫీవర్ ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవచ్చు.

నైజాం ఏరియా రికవరీపై డిస్ట్రిబ్యూటర్‌కి ఎలాంటి సమస్య లేదు. అయితే టాక్‌ని బట్టి కూడా ఈ ఫిగర్లో మార్పులు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదన్నది డిస్ట్రిబ్యూటర్‌ల వాదనగా తెలుస్తోంది. ఎటొచ్చీ సమస్య అంతా ఏపీ నుంచే అని అంటున్నారు. కారణం టిక్కెట్ రేట్ల సమస్య ఈ సినిమాని చాలా గట్టిగా దెబ్బకొట్టే అవకాశం వుందంటున్నారు.

ఏపీ లోని అన్ని ఏరియాలకు కలిపి 60 కోట్లకు ఈ ఊవీని అమ్మేశారు. అయితే ఇంత మొత్తం ప్రస్తుత పరిస్థితులలో రాబట్టడం చాలా కష్టంగా కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన `అఖండ` భారీ వసూళ్లని సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నా ఒక్క నెల్లూరు ఏరియా తప్ప ఎక్కడా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. మరి కొన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని సాధించి ప్రాఫిట్‌లోకి అడుగుపెట్టబోతోంది.

`అఖండ`తో పోలిస్తే `పుష్ప`ని రెట్టింపు మొత్తానికి అమ్మేశారు. దీంతో టిక్కెట్ రేట్లని ఏపీ ప్రభుత్వం పెంచుకునే వెసులుబాటుని కల్పిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేనని చెబుతున్నారు.

అంతే కాకకుండా వరదలతో ఇప్పటికే అతలాకుతలమైన ఏపీలో ఈ సినిమా అనుకున్న స్థాయిలో వసూళ్లని రాబట్టడం కూడా గగనమే అంటున్నారు. ఇన్ని అవాంతరాల నేపథ్యంలో డిసెంబర్ 17న వరల్డ్ వైడ్‌గా విడుదల కానున్న `పుష్ప : ది రైజ్` ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందా అన్నది తెలియాలంటే మరో వారం వేచి చూడాల్సిందే.