రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' పై క్రేజీ రూమర్..!

Tue Sep 14 2021 16:01:47 GMT+0530 (IST)

Crazy rumor on Ravi Teja Rama Rao on duty

'క్రాక్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా.. సక్సెస్ జోష్ లో ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''రామారావు ఆన్ డ్యూటీ'' సినిమా ఒకటి. వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని.. ఇందులో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. అయితే ఈ సినిమా తమిళ్ లో విజయ్ హీరోగా నటించిన 'తేరి' తరహాలో ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్.. విలన్లను ఎదిరించి ఎలా పోరాడాడు.. ఈ క్రమంలో తన జీవితంలో ఏమేమి కోల్పోవాల్సి వచ్చింది అనే అంశాలతో 'తేరి' సినిమా రూపొందింది. ''రామారావు ఆన్ డ్యూటీ'' సినిమాలో కూడా ఇదే విధంగా సిన్సియర్ ఎమ్మార్వో ఆఫీసర్ కథని చెప్పబోతున్నారట. 'తేరి' లో మాదిరిగానే ఈ చిత్రంలో ఓ పాపకి తండ్రిగా రవితేజ నటిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది.

'క్రాక్' చిత్రంలో కూడా రవితేజ ఓ పిల్లాడికి తండ్రిగా కనిపించిన సంగతి తెలిసిందే. అలానే ఈ సినిమా తమిళ 'సేతుపతి' కి ప్రేరణగా అనిపిస్తుంది. మరి ''రామారావు ఆన్ డ్యూటీ'' ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే ఈ ప్రాజెక్ట్ పై మేకర్స్ బజ్ క్రియేట్ చేశారు. ఆర్టీ టీమ్ వర్క్స్ తో కలిసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో రవితేజ సరసన రజిషా విజయన్ - దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తొట్టెంపూడి వేణు కీలక పాత్రలో కనిపిస్తుండగా.. నాజర్ - నరేష్ - పవిత్ర లోకేష్ - రాహుల్ రామకృష్ణ - 'ఈరోజుల్లో' శ్రీ - సురేఖ వాణి - మధు సూధన్ రావు - చైతన్య కృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.