Begin typing your search above and press return to search.

కాస్ట్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ .. విలాసవంతమైన కారవాన్!

By:  Tupaki Desk   |   20 Jan 2022 8:30 AM GMT
కాస్ట్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ .. విలాసవంతమైన కారవాన్!
X
ఒకప్పుడు అవుట్ డోర్ షూటింగులకు వెళితే చెట్ల క్రింద కూర్చుని అంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసేవాళ్లమని సీనియర్ ఆర్టిస్టులు చెబుతుంటారు. సీనియర్స్ .. జూనియర్స్ అనే తారతమ్యాలు ఉండేవి కాదని అంటారు. ఎవరికి వారు తన క్యారియర్ ను ఇతరులతో షేర్ చేసుకోవడం ఉండేదని చెబుతుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అవుట్ డోర్ షూటింగులో ఇప్పుడు కారవాన్లు చొరబడ్డాయి. షాట్ తరువాత కొంతమంది ఆర్టిస్టులు బయట కనిపించరు.

ఒక దశలో స్టార్ హీరోలు .. హీరోయిన్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నిర్మాతలే కారవాన్లు ఏర్పాటు చేసేవారు. కానీ ఆ తరువాత హీరోలు తామే ఖరీదైన .. విలాసవంతమైన కారవాన్లు తయారు చేయించుకోవడం మొదలైంది. ఎవరి కారవాన్ ఎన్ని కోట్లు అనేది కూడా అప్పుడప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. షాట్ కి .. షాట్ కి మధ్య స్టార్లు కారవాన్ లోకి వెళ్లిపోతుంటారు. షాట్ రెడీ కాగానే మళ్లీ వాళ్లకు పిలుపులు వెళుతుంటాయి. ఇక ఇప్పుడు సీనియర్ నరేశ్ కూడా కారవాన్ ఉపయోగిస్తుండటం విశేషం.

80వ దశకంలో హీరోగా నరేశ్ ఒక వెలుగు వెలిగాడు. విజయనిర్మల దర్శకత్వంలో ఆయన ఎక్కువ సినిమాలు చేశాడు. ఆయన ఖాతాలో మంచి మంచి హిట్లు ఉన్నాయి. ఆ తరువాత కెరియర్ పరంగా గ్యాప్ రావడంతో బుల్లితెరపై 'కౌంట్ డౌన్' వంటి గేమ్ షోస్ చేస్తూ వెళ్లాడు. ఇక ఈ మధ్య మాత్రం కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన చాలా బిజీ అయ్యాడు. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఆయన ఒకరుగా చేరిపోయాడు. ఇటీవల వస్తున్న సినిమాలలో ప్రకాశ్ రాజ్ .. రాజేంద్రప్రసాద్ .. రావు రమేశ్ .. నరేశ్ తప్పనిసరిగా ఉంటున్నారు.

అలా కాస్ట్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నరేశ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ కూడా బలంగానే ఉండటం వలన విలాసవంతమైన కారవాన్ ను ఉపయోగిస్తున్నాడు. తన క్రేజ్ కి ,.. డిమాండ్ కి తగినట్టుగానే ఛార్జ్ చేస్తున్నాడు. ఇక ఆయన 'విజయ్ కృష్ణ ఫిల్మ్ స్టూడియోస్'ను కూడా రెడీ చేస్తున్నాడు. ఏసీ ఫ్లోర్స్ తో ఈ స్టూడియో షూటింగులకు రెడీ అవుతోంది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా చూసుకుంటే, స్టార్ హీరోలతో సమానంగా నరేశ్ విలాసవంతమైన కారవాన్ వాడుతుండటం విశేషమే. కానీ ఆయనకి గల నేపథ్యం పరంగా చూసుకుంటే మాత్రం అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది.