Begin typing your search above and press return to search.

ఆర్జీవీ 'కరోనా వైరస్'..రోగం కంటే ట్రైలరే భయంకరంగా ఉందే..!

By:  Tupaki Desk   |   26 May 2020 4:00 PM GMT
ఆర్జీవీ కరోనా వైరస్..రోగం కంటే ట్రైలరే భయంకరంగా ఉందే..!
X
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దేశంలో మహమ్మారి వైరస్ వేళ విస్తరిస్తున్న వేళ కూడా సినిమా నిర్మాణం ఆపలేదని తెలిసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇంతటి లాక్ డౌన్ నిర్బంధంలోనూ ఏకంగా సినిమాను తీసేశాడు.. అదే ‘కరోనావైరస్’. ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్ మూవీ తనదేనని ఘనంగా చాటుకున్నాడు. లాక్ డౌన్ లో సినిమా పూర్తిచేయడమే కాదు.. ఏకంగా 4.05 నిమిషాల నిడివి గల ట్రైలర్ ను విడుదల చేశాడు.

సాధారణంగా ట్రైలర్ మూడు నిమిషాలలోపే ఉంటుంది.కానీ మన వర్మ ఏకంగా 4.05 నిమిషాల పాటు సాగదీసి దాన్ని నిడివి పెంచి చూసే వారికి పరీక్ష పెట్టారు.

ఇంతకీ వర్మ ‘కరోనా వైరస్’ ట్రైలర్ ఏముందయ్యా అంటే.. ‘దగ్గడం..’ అవును కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే మొదటి లక్షణం దగ్గడమే కదా.. అలా ఓ కుటుంబంలో తన కూతురికి కరోనా లక్షణాలు వచ్చినా ఆ తండ్రి అదేం లేదంటూనే కవర్ చేస్తాడు. టెస్టులు చేపిద్దాం నాన్న అని కుమారుడు అన్నా.. మనం నీట్ గా ఉన్నాం అది కరోనా కాదు.. వేడి నీళ్లతో కాపుడం పెట్టమంటాడు.

చివరకు ఆ దగ్గు దగ్గీ దగ్గీ ఇంట్లోని ముసాలవిడకు అంటడం.. ఆమెకు లక్షణాలు బయటపడడం.. తండ్రి కోపంలో కాల్పులు జరిపిన శబ్ధం వినిపించింది. వైద్యులు వచ్చి వారికి టెస్టులు చేసి కరోనాగా నిర్ధారించడం.. ఇది అంతిమంగా వర్మ లాక్డౌన్ లో అల్లిన ‘కరోనా వైరస్’ మూవీ ట్రైలర్ సారాంశం..

వైరస్ అంటుకున్న ఓ కుటుంబం సంఘర్షణను దర్శకుడు అగస్తా మంజు ప్రధానంగా చూపించాడు. వారి హావభావాలు.. ఆ కుటుంబం సంఘర్షణను ప్రధానంగా హైలెట్ చేశాడు. తప్పితే పెద్దగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేదని చూస్తే అర్థం అవుతోంది.

చివరలో వర్మ తనదైన శైలిలో తెలుగు రాష్ట్రాల సీఎంలకు జలక్ కూడా ఇచ్చారు. జస్ట్ పారాసిటమాల్ వేసుకుంటే కరోనా ఖతమైతదన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలను.. బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా పోతుందన్న ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలను చివర్లో జోడించాడు. అలా వైరస్ పై తక్కువ అంచనావేసిన తెలుగు రాష్ట్రాల సీఎంలను తన ట్రైలర్ చివర్లో ఎద్దేవా చేశాడు. ఇలా వివాదాస్పద వర్మ లాంచ్ పంచ్ గా సీఎంలనే టార్గెట్ చేయడం విశేషం.

సస్సెన్స్ థ్రిల్లర్ గా సాగిన వర్మ ‘కరోనా వైరస్’ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి..