కళారంగంలో అందరి కలల్ని నాశనం చేసిన కరోనా

Thu Jun 10 2021 06:00:01 GMT+0530 (IST)

Corona who destroyed all the arts in the art world

హైదరాబాద్ కి పెద్ద పెద్ద కలలతో వచ్చిన అందరి కలల్ని కరోనా నాశనం చేసింది. ఇండస్ట్రీలో దర్శకులవ్వాలని.. హీరోలు హీరోయిన్లు అవ్వాలని .. నటీనటులుగా ఎదగాలని.. నిర్మాతగా వెలగాలని..రచయితలుగా సత్తా చాటాలని.. లిరిసిస్టులు అవ్వాలని.. సంగీత దర్శకులు కావాలని.. ఇలా ఎందరో ఇండస్ట్రీకి వస్తుంటారు. అలా వచ్చినవాళ్లంతా కృష్ణానగర్- యూసఫ్ గూడ- ఫిలింనగర్-గణపతి కాంప్లెక్స్ ఏరియాలో అద్దె గదుల్లో తిష్ఠ వేస్తుంటారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ సినీస్టూడియోలు ఆఫీసుల చుట్టూ తిరిగేస్తుంటారు. కానీ ఇలాంటి వాళ్లందరికీ ఈ రెండేళ్లు ఒక పీడకలలాంటిది. ఎవరి కలా నెరవేరే అవకాశం లేనే లేదిప్పుడు.ఇలా అన్ని సెక్షన్లలో వాళ్లకు పెద్ద దెబ్బ పడిపోయింది. రెండేళ్లు కరోనా కాలగర్భంలో కలిపేసింది. ఎంతో విలువైన సమయం వృధా అయ్యాక ఇప్పటికీ అస్సలు హోప్ కనిపించలేదు. ఈ మాయదారి మహమ్మారీ పూర్తిగా పోయే వరకూ ఇదే పరిస్థితి. సెకండ్ వేవ్ లో నగరంలో ఎటు చూసినా చావుకేకలు. అర్థనాదాలతో మిన్నంటే దారుణ సన్నివేశం కనిపించిందని ప్రత్యక్షంగా చూసిన జర్నలిస్టులు చెబుతున్నారు. పలువురు ఇండస్ట్రీ ప్రముఖుల్ని కోల్పోవడం భయపెట్టిందన్న వాళ్లు లేకపోలేదు.

వేనవేల ఆశలతో కోటానుకోట్ల కలలతో కళా రంగంలో ఎదగాలని వచ్చే ఎందరో యువతీయువకులు ఎరక్కపోయి ఇరుక్కుపోయారు. అనూహ్యంగా కరోనా రంగ ప్రవేశంతో అష్ఠదిగ్భంధనంలో  చిక్కుకున్నారు. హైదరాబాద్ ఒక రెసిడెంట్ ఈవిట్ హాంటెడ్ హౌస్ లా మారిందన్న నివేదన చాలా మందిలో కనిపించింది. కొందరు కరోనా భారిన పడి మృత్యువాత పడినవారు ఉన్నారు. చాలా మంది కరోనా సోకి చికిత్స కోసం ఊళ్లకు జంప్ అయిపోయిన వారు ఉన్నారు. దీంతో నగరంలో చాలా చోట్ల టు-లెట్ బోర్డులు అలానే ఇంటి గేటుకు వేలాడుతూ కనిపిస్తున్నాయి.

ఇక తప్పనిసరి పరిస్థితిలో ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు హైదరాబాద్ లో ఉండాల్సిన స్థితి. భయంతో బిక్కు బిక్కుమంటూ గడిపిన వైనం కనిపిస్తోందని ప్రత్యక్షంగా చూసిన జర్నలిస్టు కం మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు తుపాకీకి వెల్లడించారు. ఇంకా ఈ కరోనా మహమ్మారీ అనే రెసిడెంట్ ఈవిల్ సినిమా లో ఎన్నాళ్లు నటించాలో తెలీదంటూ వాపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కరోనా ఇటీవల తగ్గుతోందని చెబుతున్నా కానీ ఇంకా భయాలు మాత్రం అలానే ఉన్నాయి. ఇకపై షూటింగులు మొదలైతే కార్మికులకు కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ కరోనా ఇంకా పోలేదన్నది భయపెడుతోంది. మరోవైపు 50శాతం సీటింగుతో థియేటర్లు ఓపెన్ చేస్తారా లేదా వేచి చూడాలి.