నలిగిపోతున్న పెద్ద సినిమాల నిర్మాతలు..!

Wed Jun 16 2021 14:00:42 GMT+0530 (IST)

Corona second wave effect on Tollywood?

కరోనా పాండమిక్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వాటిలో సినీ ఇండస్ట్రీ ఒకటి. గతేడాది లాక్ డౌన్ సమయంలో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి.. థియేటర్లు మూతబడటంతో పూర్తైన సినిమాలు రిలీజ్ చేసుకోలేక నిర్మాతలు చాలా నష్టపోయారు. ముఖ్యంగా ఫైనాన్స్ తెచ్చి సినిమాలను నిర్మించిన పెద్ద నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. అయితే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత టాలీవుడ్ లో నెమ్మదిగా సాదారణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని నెలల పాటు నష్టాలు చవి చూసిన నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అదే సమయంలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం పడటంతో భారీ బడ్జెట్ సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ మళ్ళీ సంక్షోభం ఎదుర్కోవాల్సి వచ్చింది.టాలీవుడ్ లో పెద్ద బ్యానర్లన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టుకొని ఉన్నాయి. వాటిలో కొన్ని ఎప్పటిలాగే అధిక వడ్డీలకు ఫైనాన్స్ తెచ్చుకొని నిర్మిస్తున్న సినిమాలు ఉన్నాయి. సెకండ్ వేవ్ ప్రభావాన్ని అంచనా వేయకుండా సినిమాలపై పెట్టుబడి పెట్టేసారు. అయితే కోవిడ్ రాకతో పెద్ద సినిమాల నిర్మాతలు మళ్ళీ నలిగిపోయే పరిస్థితి వచ్చింది. కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ పెట్టడంతో ఇండస్ట్రీలో అర్థాంతరంగా ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. ఇప్పటికే మూడు నెలలు గడిచింది. దీంతో చాలా మందికి ఫైనాన్స్ కష్టాలు వచ్చి పడుతున్నాయి.

వారిలో కొందరు నిర్మాతలు సినిమా పూర్తయినా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక.. తీసుకున్న ఫైనాన్స్ కి వడ్డీలు కట్టలేక తికమకపడుతున్నారు. మరికొందరు సినిమా బిజినెస్ పూర్తి అయిపోయి.. తీసుకున్న అడ్వాన్స్ లు మిగిలి ఉన్న షూటింగుల కోసం ఖర్చుపెట్టేసారు. సినిమాలు విడుదల అయితేనే వీరికి మంచి రోజులు వస్తాయి. మరి త్వరలోనే థియేటర్స్ తెరుచుకుని సినిమాలు బయటకు వచ్చి పెద్ద సినిమాల నిర్మాతలు మళ్ళీ పుంజుకుంటారేమో చూడాలి.