మరో బాలీవుడ్ ప్రముఖ నటుడి ఇంటికి పాజిటివ్ షాక్

Sun Jul 12 2020 17:20:00 GMT+0530 (IST)

Corona Positive For Four people in the house of a Bollywood celebrity

అంతకంతకు విస్తరిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే పలువురి ప్రముఖులకు షాకిస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా దేశంలోని మహానగరాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ.. ముంబయి.. చెన్నై.. హైదరాబాద్.. బెంగళూరు ఇలా ఏ మహానగరాన్ని మాయదారి వైరస్ వదలటం లేదు. తాజాగా ప్రముఖులే లక్ష్యమన్నట్లుగా వైరస్ వ్యాపిస్తోంది. నిన్నటికి నిన్న బాలీవుడ్ దిగ్గజ నటుడు బిగ్ బి అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ లు పాజిటివ్ కు గురి కావటంపై చిత్రపరిశ్రమ షాక్ తింది.పలువురు ప్రముఖులతో పాటు సామాన్యులు పెద్ద ఎత్తున అమితాబ్.. అభిషేక్ లుత్వరగా కోలుకోవాలంటూ కోరుతున్నారు. సోషల్ మీడియా మొత్తం ఇదే విషయం మీద చర్చ నడుస్తోంది. ఈ షాక్ నుంచి బాలీవుడ్ బయటకు రాకముందే మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబంలోని నలుగురికి పాజిటివ్ అన్న విషయం వెలుగు చూసింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.

‘‘కొద్ది రోజులుగా మా అమ్మ అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆసుపత్రికి తీసుకెళితే కోవిడ్ గా తేల్చారు. అయితే.. ఆమెలో రోగ లక్షణాలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చాం. వైద్యం సాగుతోంది’’ అని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు.

తన తల్లితో పాటు తన తమ్ముడు.. మరదలు.. మేనకోడలు కూడా కోవిడ్ బారిన పడినట్లుగా ఆయన పేర్కొన్నారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్టన్లు పేర్కొన్నారు. బీఎంసీ అధికారులు.. వైద్యులు తమకు ఎంతో సహకరిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. తాను పరీక్ష చేయించుకోగా నెగిటివ్ వచ్చిందన్నారు. ప్రస్తుతం తన తమ్ముడి ఇంటిని శానిటైజ్ చేస్తున్నట్లు చెప్పిన అనుపమ్ ఖేర్.. తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్లుగా చెప్పారు. ఒక బాలీవుడ్ ప్రముఖుడి ఇంట్లో నలుగురికి పాజిటివ్ రావటంతో.. పరిశ్రమ వర్గాల్లో కలకలం మొదలైంది.