ఇకపై సినిమాలు ఆన్ లైన్ లోనే రిలీజ్..?

Wed Apr 01 2020 13:00:59 GMT+0530 (IST)

Corona Effect On Tollywood Movies Release

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీకి కూడా కోలుకోలేని దెబ్బ పడింది. కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్‌లోకి వెళ్లింది. ఇప్పటికే మల్టీప్లెక్స్ థియేటర్స్ క్లోజ్ చేశారు. టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేకాకుండా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు తమ రిలీజ్ డేట్లను మార్చుకున్నాయి.అనుష్క నటించిన 'నిశ్శబ్దం' మెగా వారసుడి 'ఉప్పెన' చిత్రాలు ముందు ప్రకటించిన ప్రకారమైతే ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సివుంది. వీటితో పాటు నాని - సుధీర్ బాబు నటించిన 'వి' యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా? రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' లాంటి సినిమాల విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో నిర్మాతలు ఎక్జిబ్యూటర్లు పంపిణీదారులు ఈ నెలాఖరుకు అన్నీ సర్దుకుంటాయని మొదట భావించాయి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా సినిమా రిలీజ్ అయినా ప్రజలు థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్ర నిర్మాతలు సమావేశమై ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా థియేటర్లలో బొమ్మ పడే సూచనలు లేనికారణంగా మార్చి ఏప్రిల్ నెలల్లో విడుదలకావాల్సిన చిత్రాలను థియేటర్స్‌లో కాకుండా డైరెక్టుగా స్ట్రీమింగ్ యాప్స్ అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ సన్ నెక్స్ట్ ఆహా లాంటి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నదని సమాచారం.