థియేటర్ల దోపిడీకి ఇకనైనా అడ్డుకట్ట పడుతుందా?

Mon May 18 2020 10:48:13 GMT+0530 (IST)

Corona Effect On Tollywood?

ఈ కరోనా క్రైసిస్ దెబ్బకు ఎన్నో రంగాలు కుదేలవుతున్నాయి. సినీ రంగానికి అనుబంధంగా.. ఓ విడదీయలేని భాగంగా ఉన్న థియేటర్ల వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతినేలా ఉంది. అయితే ఈ విషయం ఎక్కువ మంది గ్రహించలేకుండా ఉన్నారు. ఇప్పటివరకు సినిమా రిలీజ్ అంటే తప్పనిసరిగా థియేటర్లలోనే చేయాలి అని ఒక నిశ్చితాభిప్రాయం ఉండేది. అలా చేయకపోవడం పాపమని.. ఘోరమని  ఎక్కువమంది ఫిలింమేకర్లు భావించేవారు. కమల్ హాసన్ లాంటి వారు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ గురించి గతంలో వ్యాఖ్యలు చేసినప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ ఇప్పుడు డిజిటల్ రిలీజ్ అనేది ఇది ఒక మంచి ఆప్షన్ అని ఎక్కువమంది ఒప్పుకుంటున్నారు.సినిమాలు ఎక్కువ థియేటర్లు తక్కువ.. దీంతో థియేటర్లు దొరకవు.. ఎక్కువ థియేటర్లపై కొందరు పెత్తనమే ఉంటుంది.. ఫెస్టివల్ సీజన్ డేట్లు హాలిడే సీజన్ లపై పెద్ద స్టార్ హీరోలకు.. నిర్మాతలకు గంపగుత్తగా హక్కులు ఉంటాయి. ఇక సంక్రాంతి లాంటి సీజన్లో సినిమాలు రిలీజ్ చేయాలంటే స్టార్ హీరోల మధ్య కూడా స్టార్ వార్స్ జరుగుతాయి. ఇప్పుడు స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే సాధారణమైన సినిమాలకు ఓటీటీ రిలీజ్ అనేది మంచి ఆప్షన్. పెట్టుబడి రికవరీ అవుతుంది అనుకున్నప్పుడు థియేటర్ రిలీజ్ మాత్రమే చేసుకోవాలి అని మంకుపట్టు పట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే థియేటర్లో రిలీజ్ చేసినందువల్ల గ్యారెంటీగా పెట్టుబడి రికవరీ అవుతుందని ఎవరు హామీ ఇవ్వరు. అదే ఓటీటీ రిలీజ్ కు మంచి బేరం వస్తే కనీసం పెట్టుబడి అయినా వెనక్కి వస్తుంది. దీంతో నెమ్మదిగా చాలామంది నిర్మాతలు ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇది తప్పనిసరిగా థియేటర్ల వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే అధికంగా ఉన్న టికెట్ ధరలతో చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. రిపీటెడ్ ఆడియన్స్ తగ్గారు.  ఇక క్యాంటీన్లో అమ్మే తినుబండారాల రేట్లు చూస్తే ఆరోగ్యవంతులైన ప్రేక్షకులకు కూడా గుండెపోటు రాకమానదు.  5 రూపాయల వస్తువును 50కి అమ్ముతూ ప్రేక్షకులు జేబులకు భారీగా చిల్లులు పెడుతూ ఉంటారు. అలా అమ్మితే నేరమని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది.. థియేటర్లలోనే నోటీసులు కూడా అంటించి ఉంటారు కానీ ఎవరూ పట్టించుకోరు. ఇప్పటికైనా థియేటర్లు ప్రేక్షకులను పీల్చి పిప్పి చేసే పద్ధతులకు స్వస్తి చెప్తే కానీ ప్రేక్షకులు తిరిగి థియేటర్ల వంక చూడరు. డబ్బులు వెదజల్లే అలవాటు ఉండేవాడు ఎలాగైనా ఖర్చు పెడతాడు.. పోతురాజు తరహాలో థియేటర్ల రేట్లతో కొరడా దెబ్బలు కొట్టించుకుంటాడు. కానీ ఓటీటీలో కొత్త సినిమాలు అందుబాటులో ఉన్నప్పుడు మల్టీప్లెక్స్ టికెట్ రేట్లను.. క్యాంటీన్ బాదుడును భరించే ఓపిక చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇలాంటి కొన్ని విషయాలలో థియేటర్ల యాజమాన్యాలు మారకపోతే వారికి ఇబ్బంది తప్పదు.