భీష్మకు మరో వార్నింగ్.. టైటిల్ మార్చక తప్పదా?

Thu Feb 20 2020 10:15:11 GMT+0530 (IST)

Controversy on Bheeshma movie Title

మహాభారతానికి మూలం భీష్మ పితామహుడు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఆయన పేరును ఒక కమర్షియల్ సినిమాకు పెట్టటం ఏమిటి? సినిమాలో వెకిలిచేష్టలు.. అసభ్యకరమైన సీన్లు ఉన్నాయి.. వెంటనే సినిమా పేరు మార్చాలంటూ భీష్మ మూవీ ప్రొడ్యూసర్ల కు వరుస హెచ్చరికలు జారీ అవుతున్నాయి. నితిన్.. రష్మిక మందాడ జంటగా నటించిన ఈ చిత్రం మరో రోజు లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇలాంటివేళ.. ఈ సినిమా టైటిల్ మీద రచ్చ జోరందుకుంది. తాజాగా తెలంగాణ బెస్తగూండ్ల చైతన్య సమితి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. భీష్మ టైటిల్ ను మార్చాలని.. సినిమా పేరుతో పాటు హీరో క్యారెక్టర్ పేరును మార్చాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పేరు మార్చకపోతే జరిగే పరిణామాలకు బాధ్యులు అవుతారన్న హెచ్చరికలు జారీ అయ్యాయి.

సినిమా టైటిల్ విషయంలో తాము ఇప్పటికే ఫిలించాంబర్ లో కంప్లైంట్ చేశామని.. సినిమా నిర్మాత వద్దకు వెళ్లగా..తమకు సినిమా చూపించారన్నారు. తాము సినిమా చూశామని.. అభ్యంతరకర సీన్లు ఉన్నాయని.. ఆ విషయాన్ని నిర్మాతకు చెబితే పట్టించుకోవటం లేదని సమితి అధ్యక్షులు సత్యనారాయణ చెబుతున్నారు. ఈ సమితి చేస్తున్న డిమాండ్లకు బీజేపీ ప్రతినిధి మైలారం రాజు సమర్థిస్తున్నారు. ఈ రోజు తాము డీజీపీని కలుస్తామని.. ఆయనకు వినతిపత్రం ఇస్తామని చెబుతున్నారు.

రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న నేపథ్యంలో.. ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది. రిలీజ్ ముందు జరుగుతున్న ఈ లొల్లి సినిమా మీద అందరి దృష్టి పడేలా చేస్తోంది. అయితే.. ఈ హెచ్చరికల పర్వం ఎక్కడి వరకూ వెళుతుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.