ఒక్క హిట్‌తో రూ.18 కోట్లతో ఇల్లు కొన్న వివాదాస్పద దర్శకుడు!

Tue Oct 04 2022 15:00:01 GMT+0530 (India Standard Time)

Controversial director who bought a house for Rs 18 crore with one hit!

ప్రముఖ దర్శకనిర్మాత వివేక్ అగ్నిహోత్రి ఇప్పుడు బాలీవుడ్లో అందరు హీరోలకు హాట్ ఫేవరెట్ అయిపోయాడు. కేవలం 20 కోట్ల రూపాయలలోపు బడ్జెట్‌తో ఆయన తెరకెక్కించిన కశ్మీర్ ఫైల్స్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.340 కోట్ల రూపాయలతో సత్తా చాటింది. కశ్మీర్‌లో కాశ్మీర్ పండిట్ల ఊచకోత.. వారి వ్యథలను కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో తెరకెక్కించారు. ఈ సినిమాకు పలు రాష్ట్రాలు వినోద పన్ను మినహాయింపును కూడా ప్రకటించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి హోం శాఖ మంత్రి అమిత్ షా వరకు అంతా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.కాశ్మీర్ ఫైల్స్ తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టిన వివేక్ అగ్నిహోత్రి ఈసారి సిక్కుల ఊచకోతపై సినిమా తెరకెక్కించనున్నాడు. 1984లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే కాల్చిచంపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశ రాజధాని ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోశాయి. కొన్ని వందల మంది చంపబడ్డారు. ఈ నేపథ్యంలో వివేక్ అగ్నిహోత్రి తన తదుపరి ప్రాజెక్టును తెరకెక్కించేపనిలో పడ్డారు.

ఇప్పటికే కశ్మీర్ ఫైల్స్ సినిమాను తెరకెక్కించడం ద్వారా కొన్ని వర్గాల నుంచి ఉగ్రవాదుల నుంచి ఆయన ముప్పును ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది. దీంతో కేంద్ర హోం శాఖ ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్పించింది. ఇప్పుడు సిక్కుల ఊచకోతపై సినిమా చేస్తుండటంతో మరో వివాదం ఆయన మెడకు చుట్టుకోనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాశ్మీర్ ఫైల్స్ సంచలన విజయం సాధించడంతో వివేక్ అగ్నిహోత్రి దశ తిరిగింది. ముంబైలో దాదాపు రూ.18 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను ఆయన కొనుగోలు చేసినట్టు బాలీవుడ్ టాక్. వివేక్ అగ్నిహోత్రి ఆయన భార్య పల్లవి జోషి.. ముంబైలోని వెర్సోవాలో 3258 చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఎక్స్టసీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ అపార్ట్‌మెంట్‌ను విక్రయించిందని ఇప్పటికే వివేక్ అగ్నిహోత్రి దంపతులు స్టాంప్ డ్యూటీ కింద రూ.1.07 కోట్లు చెల్లించారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. సెప్టెంబర్ 27న అపార్ట్‌మెంట్ వివేక్ అగ్నిహోత్రి దంపతుల పేరుతో రిజిస్టర్ అయ్యిందని అంటున్నారు. మూడు కార్లు పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా ఈ అపార్ట్‌మెంట్ ఉందని సమాచారం.

కాగా గతంలో తాష్కెంట్ ఫైల్స్ అనే సినిమాతో వివేక్ అగ్నిహోత్రి మంచి పేరు తెచ్చుకున్నాడు. భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మిస్టరీ మరణంపై ఈ సినిమా తెరకెక్కింది. 1965లో నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి రష్యాలోని మాస్కోలో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు వచ్చే సినిమాకు కూడా వివేక్ అగ్నిహోత్రి వివాదాస్పద అంశాన్నే ఎంచుకుంటున్నారు. సిక్కుల ఊచకోతను ఈసారి స్పృశించనున్నారు. ఈ సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే!

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.