Begin typing your search above and press return to search.

''సుశాంత్ సింగ్ 6 నెలల్లో 7 సినిమా ఆఫర్స్ కోల్పోయాడు''

By:  Tupaki Desk   |   16 Jun 2020 10:30 AM GMT
సుశాంత్ సింగ్ 6 నెలల్లో 7 సినిమా ఆఫర్స్ కోల్పోయాడు
X
ప్రముఖ బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబై లోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ ఉరేసుకొని చనిపోయాడనే వార్త యావత్ సినిలోకాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక సుశాంత్ మరణంపై సినీ ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కెరీర్‌‌ లో ఆశించిన స్థాయికి ఎదగలేకపోతున్నాననే బాధతో అతడు ప్రాణం తీసుకున్నాడని.. బ్రేకప్స్ కూడా ఒక కారణమని.. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది సుశాంత్ ని తొక్కేశారని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. సుశాంత్ ని బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలే హత్య చేశారని వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని.. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా హీరోలుగా వచ్చిన వాళ్లను ఎదగనివ్వరని కామెంట్ చేసింది. దీనిపై ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కంగనా.. బాలీవుడ్ లో పెత్తనం నడిపే పెద్దల పై విమర్శలు గుప్పించింది.

ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు స్టార్ డైరెక్టర్ శేఖర్ కపూర్ సంచలన ట్వీట్ చేశారు. ''నువ్వు ఎంత బాధ అనుభవించావో నాకు తెలుసు. నిన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తుల గురించి తెలుసు. వారి వేధింపులు భరించలేక నువ్వు నా భుజాలపై పడి కన్నీరు పెట్టుకున్నావు. ఆరు నెలలుగా నేను నీకు దగ్గరగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు. కనీసం నువ్వు నన్ను కలిసి ఉన్నా బాగుండేది. నీకు ఇలా జరగడం వారి కర్మ.. నీది కాదు'' అంటూ ఆవేదనగా ట్వీట్ చేశారు. ఇదంతా చూస్తుంటే ఇండస్ట్రీలో సుశాంత్ ని చాలా మంది తొక్కేయాలని చూసారని అర్థం అవుతోందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కంగన, శేఖర్ కపూర్ వ్యాఖ్యలను సమర్థిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. అందులోనూ గతంలో సుశాంత్ ఒక ఇంటర్వ్యూలో ''బాలీవుడ్ నన్ను ఫామిలీ మెంబెర్ గా అనుకోవడం లేదని.. ఇండస్ట్రీలో జరిగే కార్యక్రమాలకి నన్ను ఇన్వైట్ చేయరు'' అని చెప్పినట్లుగా పోస్టులు పెడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజయ్ నిరుపన్ సుశాంత్ మరణంపై స్పందిస్తూ.. ''సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ 'చిచోరే' సక్సెస్ తర్వాత 7 చిత్రాలకు సంతకం చేశారు. అయితే 6 నెలల్లో అన్ని సినిమాలు అతని చేతి నుండి జారిపోయాయి. ఎందుకు? చిత్ర పరిశ్రమ యొక్క క్రూరత్వం వేరే స్థాయిలో పనిచేస్తుంది. ఈ క్రూరత్వం ప్రతిభావంతులైన యాక్టర్ ని చంపింది'' అని ట్వీట్ చేశారు. నిన్న జరిగిన సుశాంత్ అంత్యక్రియలకు ఆయన మరణంపై బ్లేమ్ కి గురైన సెలబ్రెటీలు ఎవరూ హాజరు కాకపోవడంతో నెటిజన్స్ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. సంజయ్ నిరుపన్, శేఖర్ కపూర్, కంగనా రనౌత్ వ్యాఖ్యలకి బలం చేకూరిందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ సినీ ప్రముఖులు వివేక్ ఒబెరాయ్, శ్రద్ధాకపూర్, కృతిసనన్, రియా చక్రవర్తి, రాజ్ కుమార్ రావ్, అభిషేక్ కపూర్ మరియు పొలిటిషియన్ సంజయ్ నిరుపన్ తదితరులు హాజరయ్యారు.