Begin typing your search above and press return to search.

ఎటూ తేల్చుకోలేక పోతున్న సురేశ్ బాబు!

By:  Tupaki Desk   |   24 Oct 2021 11:30 PM GMT
ఎటూ తేల్చుకోలేక పోతున్న సురేశ్ బాబు!
X
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సురేశ్ బాబుకి ఉన్న పేరు ప్రఖ్యాతులను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అపారమైన అనుభవం ఆయన సొంతం. తన బ్యానర్ కి సంబంధించిన సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్ర్రతగా ఉంటారు. ఆయన నిర్ణయాలు నియమాల్లా అనిపిస్తాయి. అంతగా ఆయన వాటిని అమలుపరుస్తూ ఉంటారు. కథా చర్చల దగ్గర నుంచి జనంలోకి సినిమా వెళ్లెవరకూ ఆయన కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటారు. అలాంటి సురేశ్ బాబు, 'దృశ్యం 2' .. 'విరాటపర్వం' సినిమాల విడుదలను తేల్చకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఆ మధ్య తమిళంలో ధనుశ్ చేసిన 'అసురన్' సినిమా అక్కడ సంచలన విజయాన్నిసొంతం చేసుకోవడంతో, ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను తీసుకుని అదే నిర్మాతతో కలిసి సురేశ్ బాబు 'నారప్ప'ను నిర్మించారు. చాలా తక్కువ సమయంలో .. తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను పూర్తి చేయడం .. అసలు ఆ తరహా కథను ఎంచుకోవడం సురేశ్ బాబు ప్లానింగ్ లో భాగమే. ఆ సమయంలో థియేటర్ల పరిస్థితి కాస్త అటు ఇటుగా ఉండటంతో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వారికి అప్పగించేశారు. ఈ విషయంలో సురేశ్ బాబు చాలా ఫాస్టుగా నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఇప్పుడు ఆయన చేతిలో 'దృశ్యం 2' .. 'విరాటపర్వం' సినిమాలు రెడీగా ఉన్నాయి. మలయాళంలో 'దృశ్యం' సీక్వెల్ గా 'దృశ్యం 2' చేసిన జీతూ జోసెఫ్, మరో భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆయనే తెలుగులో 'దృశ్యం 2' సినిమాకి దర్శకత్వం వహించాడు. సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే కథ కావడం వలన, ఈ సినిమా కోసం వెంకటేశ్ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా పట్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఆత్రుత కనబరుస్తున్నారు. రానా కథానాయకుడిగా చేసిన 'విరాటపర్వం' కోసం ఎదురుచూసేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రానా నక్సలైట్ గా నటించడం ఒక విశేషమైతే, ఆయనను ప్రేమించే గ్రామీణ యువతిగా సాయిపల్లవి నటించడం మరో విశేషం,

ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో అంచనాలు పెంచాయి. అయితే ఈ రెండు కూడా ఓటీటీకి వెళతాయా? థియేటర్లకు వస్తాయా? అనే విషయంలో ఇంతవరకూ క్లారిటీ రాలేదు. వీటి విడుదల విషయాన్ని సురేశ్ బాబు ఇంతవరకూ తేల్చలేదు. థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఆయన ఈ సినిమాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇటీవల వచ్చిన 'లవ్ స్టోరీ' .. 'బ్యాచ్ లర్' భారీ వసూళ్లను రాబట్టడంతో, మళ్లీ ఆయన ఈ వైపు మొగ్గు చూపుతున్నారని టాక్. మిగతా సినిమాలన్నీ కూడా కేలండర్లో ఏ డేట్ దగ్గర ఖాళీ దొరికితే అక్కడ కర్చీఫ్ వేసేసి సర్దుకున్నాయి. ఎక్కడా ఖాళీ లేకపోవడంతో సురేశ్ బాబు ఆలోచనలో పడటమే ఈ ఆలస్యానికి కారణమనే టాక్ కూడా వినిపిస్తోంది.