అయోమయంలో 'ఆదిపురుష్' టీమ్..?

Thu May 26 2022 08:59:04 GMT+0530 (IST)

Confused Adipurush team

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న మైథిలాజికల్ డ్రామా ''ఆదిపురుష్''. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురవుతున్నారు.

'ఆదిపురుష్' సినిమాలో రాఘవ పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా.. జానకి పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్ నటిస్తోంది. ప్రతినాయకుడు లంకేశ్ గా హిందీ స్టార్ సైఫ్ అలీఖాన్.. లక్ష్మణ్ గా యువ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు.

2021 ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి.. అదే ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేశారు. ముంబైలో  వేసిన స్పెషల్ సెట్స్ లో ఈ సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకుంది. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో 'ఆదిపురుష్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సరికొత్త అనుభూతిని అందించడానికి ఈ సినిమా కోసం లేటెస్ట్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తారు.

ఏకకాలంలో హిందీ - తెలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు భారీగా వీఎఫ్ఎక్స్ వర్క్స్ అవసరం అవుతున్నాయి. అందుకే షూటింగ్ కంప్లీట్ అయినా చేతిలో పబ్లిసిటీ మెటీరియల్ లేదని.. ఈ అయోమయం కారణంగానే ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదని టాక్ వినిపిస్తోంది.

నిజానికి గతేడాది శ్రీరామనవమి కి 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూశారు. అయితే నిరాశే ఎదురైంది. ఈ ఏడాది పండక్కి అయినా ప్రభాస్ లుక్ వస్తుందని ఆతృతగా వేచి చేశారు. కానీ మేకర్స్ మాత్రం ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో సరిపెట్టారు.

'ఆదిపురుష్' చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే రిలీజ్ కు ఇంకా ఎనిమిది నెలల సమయం కూడా లేదు. కానీ ఇప్పటివరకు ప్రభాస్ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ మొదలు పెట్టలేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని చేతిలో పెట్టుకొని ప్రచారం చేసుకోకపోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కనీసం జులై నెలలోగానైనా ఫస్ట్ లుక్ ఇవ్వాలని 'ఆదిపురుష్' టీమ్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇది ప్రభాస్ కు ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ మూవీ. పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భాషల్లో విడుదల కాబోతోంది.

టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని కోసం దాదాపు 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2022 జనవరి 12న భారీ ఎత్తున ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.