కామ్రేడ్ చైతన్య గీతం - లిరికల్ వీడియో

Thu Jul 18 2019 18:22:47 GMT+0530 (IST)

ఈ నెల 26న విడుదల కానున్న డియర్ కామ్రేడ్ ఆడియోలోని మరో కీలకమైన పాటను విడుదల చేశారు. కామ్రేడ్ యాంతం అనే పేరుతో నాలుగు భాషల్లో రిలీజ్ చేసిన ఈ ట్రాక్ ఒకరకంగా టైటిల్ సాంగ్ అని చెప్పొచ్చు. వెనుకబడిన వర్గాలను చైతన్య పరిచేలా వాళ్లకు అండగా నిలిచే నాయకుడిగా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చేలా సాగిన ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండ మరోసారి సింగర్ అవతారం ఎత్తడం విశేషం. పూర్తి పాట పాడలేదు కానీ బేస్ అందుకుంది మాత్రం తనే.మిగిలిన భాగంలో తనతో పాటు టోనీ-మిక్కీలు శృతి కలిపి ఉత్సాహాన్ని ఇచ్చారు. సీనియర్ రచయిత చైతన్య ప్రసాద్ లిరిక్స్ సమకూర్చిన ఈ ఎమోషనల్ సాంగ్ స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలో వస్తుంది. వాటి తాలూకు విజువల్స్ కూడా లిరికల్ వీడియోలో పొందుపరిచారు. ఇప్పటిదాకా వచ్చిన పాటల్లో హై వోల్టేజ్ సాంగ్ ఇదే అని చెప్పొచ్చు. కథను మలుపు తిప్పే పాట కావడంతో ఆడియో చివరిలో దీన్ని విడుదల చేసినట్టు కనిపిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ఫ్రెష్ గా ఉంది. బీట్స్ ని కలగలుపుతూనే రిథమ్ ని మైంటైన్ చేయడం విశేషం.

భావం లోతుగా ఉన్నా పదాలు సింపుల్ గా ఉండటం విశేషం. మల్టీ లాంగ్వేజ్ కోసం కంపోజ్ చేసిన పాట కావడంతో కొంత ఆ ఛాయలు కనిపించినప్పటికీ ఫైనల్ గా మెప్పించే విధంగా ఉండటం ఫాన్స్ కి కిక్ ఇచ్చేదే. రష్మిక మందన్న హీరొయిన్ గా నటించిన డియర్ కామ్రేడ్ ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఇప్పుడు ఆడియో కూడా సక్సెస్ కావడంతో ప్రేక్షకుల చూపు రిలీజ్ కానున్న 26 వైపు మళ్ళింది