పవన్ మిస్సయితే హరీశ్ కు ఇప్పట్లో మరో హీరో దొరకడం కష్టమే..!

Thu Jul 07 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

Commerical Director Harish Shankar

కమర్షియల్ డైరెక్టర్ గా హరీష్ శంకర్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి సినిమా 'షాక్' ఇవ్వడంతో ఐదేళ్ల గ్యాప్ తీసుకొని 'మిరపకాయ్' చిత్రంతో సక్సెస్ కొట్టారు. ఈ క్రమంలో 'గబ్బర్ సింగ్' 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' 'డీజే-దువ్వాడ జగన్నాథమ్' వంటి హిట్లు.. 'రామయ్యా వస్తావయ్యా' వంటి డిజాస్టర్ అందుకున్నారు. అయితే చివరగా 'గద్దలకొండ గణేష్' సినిమాతో అలరించిన హరీష్.. ఈ మూడేళ్లలో మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోయారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ''భవదీయుడు భగత్ సింగ్'' అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని ప్రకటించారు హరీశ్ శంకర్. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్ లో ఇంకో సినిమా అనేసరికి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. హీరోయిన్ తో పాటుగా సాంకేతిక నిపుణుల వివరాలు కూడా వెల్లడించారు. అయితే అప్పుడెప్పుడో అనౌన్స్ చేయబడిన ఈ ప్రాజెక్ట్.. ఇప్పటికీ పట్టాలెక్కకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

నిజానికి భవదీయుడు ప్రాజెక్ట్ ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. పాండమిక్ రావడం.. పవన్ కళ్యాణ్ ఇతర ప్రాధాన్యతల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. హరీష్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకొని పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఊ అంటే అప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు సముద్ర ఖని తో పవన్ ఓ రీమేక్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారనే టాక్ నడుస్తోంది.

అంతేకాదు త్వరలో జనసేన అధినేత పూర్తిగా క్రియాశీలక రాజకీయాలపై ఫోకస్ చేయనున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ తో సినిమా ఎప్పుడు చేసారనేది చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు మరో హీరోతో మూవీ చేయాలని భావించారని.. దీనికి నిర్మాతలు ఆసక్తి చూపలేదని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే లేటెస్టుగా హరీశ్ చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ అభిమానులను మరింత గందరగోళంలోకి నెట్టింది. మీకు ఏది రాసిపెట్టి ఉంటుందో అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని అర్థం వచ్చేలా బుధవారం ఓ కొటేషన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో హరీష్ ప్రస్తుతానికి భవదీయుడు ని పక్కన పెట్టి మరో హీరోతో సినిమా చేయడానికి రెడీ అయిపోయారా అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ నిజంగా పపవన్ కళ్యాణ్ తో సినిమా లేకపోతే మాత్రం హరీశ్ శంకర్ కు ఇప్పుడప్పుడే మరో స్టార్ హీరో దొరికే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ సీనియర్ హీరోలు.. టైర్-1 హీరోలెవరూ ఖాళీగా లేరు. ఒక్కొక్కరు రెండేసి ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. పోనీ టైర్-2 హీరోలతో వెళదామని అనుకున్నా.. వాళ్ళు కూడా మూడు నాలుగు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టుకొని ఉన్నారు. సో పవన్ మిస్సయితే హరీష్ కు ఇప్పుడు మరో హీరో దొరకడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇకపోతే 'భవదీయుడు భగత్ సింగ్' ప్రాజెక్ట్ లేట్ అవుతుండటంతో హరీష్ శంకర్ మధ్యలో 'ATM' అనే వెబ్ సిరీస్ బాధ్యతలు తీసుకున్నారు. దీనికి స్క్రిప్ట్ అందించడమే కాదు.. దిల్ రాజు తో కలిసి నిర్మాణంలోనూ భాగం పంచుకుంటున్నారు. ఇదే క్రమంలో వీలైనంత త్వరగా పవన్ ప్రాజెక్ట్ ను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్తారేమో వేచి చూడాలి.