Begin typing your search above and press return to search.

'నాగబాబుతో గొడవ టీ కప్పులో తుఫాను లాంటిది'

By:  Tupaki Desk   |   16 May 2021 9:30 AM GMT
నాగబాబుతో గొడవ టీ కప్పులో తుఫాను లాంటిది
X
కమెడియన్ కమెడియన్ పొలిటీషియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గత ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ - నాగబాబులపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. జనసేనకు నాగబాబు ఇచ్చిన కోటి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసంటూ అప్పట్లో పృథ్వీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆ సమయంలో పృథ్వీ మెగా అభిమానుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. అయితే ఆ మధ్య పలు ఇంటర్వ్యూలలో దీని గురించి మాట్లాడిన పృథ్వీ.. రాజకీయాల్లో భాగంగానే తాను పవన్ - నాగబాబు లను విమర్శించానని.. అంతకు మించి వేరే దురుద్దేశం లేదని చెప్పారు. తాజాగా పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందనే దానిపై మాట్లాడారు.

మెగా ఫ్యామిలీతో ఎందుకు దూరంగా ఉన్నాననే దానికి నాగబాబు గారే సమాధానమని.. మా ఇద్దరి మధ్య ఉన్న గొడవ టీ కప్పులో తుఫాను లాంటిదని పృథ్వీరాజ్ అన్నారు. ''ఈ మధ్య ఓ ఛానల్ లో నిర్వహించిన ఓ ప్రోగ్రామ్ లో నాగబాబుతో పాటు పాల్గొన్నాను.. ఆ సందర్భంగా 'మెగా ఫ్యామిలీలో అందరూ మంచి టైమింగ్ ఉన్న పృథ్వీని ఇష్టపడతారు' అని అన్నారు. అలానే పాలిటిక్స్ వేరు సినిమా వేరని చెప్పారు. దీంతో అది క్లియర్ అయింది'' అని ఆయన చెప్పుకొచ్చారు. ''మెగాస్టార్ తో 'ఖైదీ నెం.150' సినిమా చేసినప్పుడు లెంత్ ఎక్కువ అవుతుందని నా సీన్స్ నాకు చెప్పే కట్ చేశారు. కానీ తర్వాత యాడ్ చేశారు. పవన్ తో 'గబ్బర్ సింగ్' 'కాటమరాయుడు' సినిమాలు చేశాను. ఇప్పుడు మెగా అల్లుడితో ఒక సినిమా చేస్తున్నాను'' అని పృథ్వీ చెప్పారు.

'రంగస్థలం' సినిమాలో డబ్బింగ్ కూడా చెప్పిన తర్వాత సుకుమార్ నా పాత్రని తీసేశారు. అయితే తర్వాత రామ్ చరణ్ తో 'వినయ విధేయ రామ' సినిమా చేసాను. అయితే ఆయన దగ్గర రంగస్థలం గురించి ఏమీ మాట్లాడలేదు అని పృథ్వీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ నటించిన 'శ్రీకృష్ణార్జున విజయం' సినిమాలో తనని కర్ణుడి పాత్ర నుంచి తీసేయడాన్ని గుర్తు చేసుకున్నారు. తమిళ్ లో సంతానం సినిమాలో నటంచడం వల్ల స్టార్ హీరో విజయ్ సినిమాలో అవకాశం వచ్చిందని.. దీంతో పాటు మరో ఆరు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని పృథ్వీరాజ్ వెల్లడించారు.