Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : కలర్ ఫోటో

By:  Tupaki Desk   |   23 Oct 2020 5:24 PM GMT
మూవీ రివ్యూ : కలర్ ఫోటో
X
చిత్రం : 'కలర్ ఫోటో'

నటీనటులు: సుహాస్ - చాందిని చౌదరి - సునీల్ - వైవా హర్ష - ఆదర్శ్ బాలకృష్ణ - రాజు తదితరులు
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం: వెంకట్ శాఖమూరి
కథ: సాయిరాజేష్
నిర్మాతలు: సాయిరాజేష్ - బెన్ని ముప్పానేని
రచన - దర్శకత్వం: సందీప్ రాజ్

ఓటీటీ కాలంలో డిజిటల్ రిలీజ్‌ కు రెడీ అయిపోయిన కొత్త సినిమా ‘కలర్ ఫోటో’. కమెడియన్ సుహాస్ ను హీరోగా పరిచయం చేస్తూ తెలుగమ్మాయి చాందిని చౌదరిని కథానాయికగా పెట్టి కొత్త దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన చిత్రమిది. హృదయ కాలేయం - కొబ్బరిమట్ట చిత్రాల ఫేమ్ సాయిరాజేష్ కథ అందిస్తూ నిర్మించిన ఈ సినిమా ‘ఆహా’లో ఈ రోజే విడుదలైంది. మంచి ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

జయకృష్ణ (సుహాస్) ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంజినీరింగ్ చదువుతున్న కుర్రాడు. అతను తన కాలేజీలోనే చదివే దీప్తి (చాందిని చౌదరి)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఐతే తన ప్రేమను ఆమెకు చెప్పడానికి అతడికి చాలా భయం. అందుక్కారణం తన రంగే. నల్లగా ఉండే తనను ఎంతో అందంగా ఉండే దీప్తి ప్రేమించదన్న ఉద్దేశంతో ఆమెను దూరం నుంచే చూస్తూ ఆరాధిస్తుంటాడు. కానీ జయకృష్ణ వ్యక్తిత్వం నచ్చి అతణ్ని దీప్తి ప్రేమిస్తుంది. దీంతో జయకృష్ణ ఆనందానికి అవధులుండవు. ఇద్దరూ ప్రేమలో తేలియాడుతున్న సమయంలో దీప్తి అన్నయ్య అయిన ఇన్‌స్పెక్టర్ రామరాజు (సునీల్) రంగంలోకి దిగుతాడు. అతడికి జయకృష్ణ నచ్చడు. ఓ అందగాడిని చూసి తన చెల్లెలికి పెళ్లి చేయాలనుకుంటాడు. క్రూరుడైన రామరాజు పెట్టే ఇబ్బందుల్ని తట్టుకుని జయకృష్ణ.. దీప్తిని దక్కించుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయి.. ఇద్దరి మధ్య ప్రేమ.. మధ్యలో వాళ్ల ప్రేమకు అడ్డంకిగా అమ్మాయి అన్నయ్య. ఈ అడ్డంకిని దాటి హీరో హీరోయిన్లు ఒక్కటయ్యారా లేదా? ఇదీ స్థూలంగా ‘కలర్ ఫోటో’ కథ. వినీ వినీ విసుగెత్తిపోయిన.. చూసి చూసి అరిగిపోయిన కథే ఇది. మరి ఈ తరానికి చెందిన ఒక యంగ్ టీం ఇలాంటి పాత కథను ఎంచుకోవడమేంటి అని ఆశ్చర్యం కలగక మానదు. ఐతే వైవిధ్యం కోసం ఎప్పుడూ చూసే ఆస్తుల్లో అంతరాన్ని కాకుండా కాన్ఫ్లిక్ట్ పాయింటుగా ‘రంగు’ను ఎంచుకోవడం.. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా కథను ముగించడం ఇందులో ఉన్న వైవిధ్యం. కానీ ‘కొత్త’ అనుకునే ఈ విషయాలు వినడానికి బాగుండొచ్చు కానీ.. వాటిని తెరపై కన్విన్సింగ్ గా ప్రెజెంట్ చేయడం అంత తేలికైన విషయం కాదు. ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ కొంత ఆశలు రేపినట్లే రేపి.. కీలకమైన సందర్భాల్లో తడబడ్డాడు. ప్రేమకథను పండించడానికి అవసరమైన మంచి సెటప్ కుదిరినా సరే.. అనాసక్తికర కథనంతో, కన్విన్సింగ్ గా లేని ముగింపుతో ప్రేక్షకులను నిరాశకు గురి చేశాడు.

ఏదో చెప్పాలనుకుని.. ఆ దిశగా ప్రయత్నం మొదలుపెట్టి మధ్యలో మలుపు తీసుకుని ఎటో వెళ్లిపోయిన గందరగోళం ‘కలర్ ఫోటో’లో పలు సందర్భాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు.. ఒక మనిషిని రంగును బట్టి అంచనా వేయొద్దని చాలా బలంగా చెప్పాలన్నది రచయిత, దర్శకుల ఉద్దేశం. ఒక చోట రంగును బట్టి వివక్ష చూపించడం మీద హీరో పెద్ద లెక్చరే దంచుతాడు. మరో సందర్భంలో విలన్ని సైతం ఇదే విషయం మీద నిలదీస్తాడు. కానీ అదే హీరో తాను నల్లగా ఉన్నాను కాబట్టి హీరోయిన్ తనను ప్రేమించదేమో అన్న ఉద్దేశంతో దూరం దూరంగా ఉంటాడు. ఆమెను మెప్పించడానికి క్రీములు రాస్తాడు. ఎవడో తనను కర్రి నాకొడుకు అని తిట్టాడని ఆ కోపంలో కూడా క్రీమ్ అందుకుంటాడు. హీరోయిన్ దగ్గర సైతం తన ఆత్మన్యూనతా భావాన్ని బయటపెట్టుకుంటాడు. హీరోయిన్ తనను ప్రేమించాక కూడా.. చివర్లో సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశంలో సైతం ఇదే భావాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ వైరుధ్యం ఏంటన్నది అర్థం కాదు.

ఇక మరో ఉదాహరణ.. ‘ప్రేమించిన వాళ్లను అందనంత ఎత్తులో నుంచోబెట్టడమే నిజమైన ప్రేమ’.. కలర్ ఫోటో టైటిల్స్‌ లో పడే ముందు మాట ఇది. సినిమాలో కూడా ఒక చోట ఈ డైలాగ్ చెప్పిస్తారు. ఐతే దీన్ని ఉద్దేశమేంటన్నది సినిమా చూస్తున్నపుడు కానీ.. చూశాక ఎంత ఆలోచించినా కానీ అర్థం కాదు. సినిమా ఆరంభ సన్నివేశంలో హీరోయిన్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కనిపించడంతోనే హీరో హీరోయిన్లు కలవలేదన్న విషయం మొదట్లోనే అర్థమైపోతుంది. అందులో సస్పెన్స్ ఏమీ లేదు. ఐతే మధ్యలో మళ్లీ ప్రేక్షకుల్ని ఫూల్స్ ను చేయడానికా అన్నట్లుగా కథ సుఖాంతమైనట్లు ఒక ఎపిసోడ్ నడిపించారు. కానీ అదంతా ఒక కల్పన అని చూపిస్తూ కథను ప్రి క్లైమాక్స్ లో మలుపు తిప్పి మరోలా ముగించారు. ఐతే హీరో పాత్రకు ముగింపులో ఏదైనా ట్విస్టు ఇచ్చి ‘ప్రేమించిన వాళ్లను అందనంత ఎత్తులో నుంచోబెట్టడమే నిజమైన ప్రేమ’ అనే క్యాప్షన్ కు ఏమైనా జస్టిఫికేషన్ ఇస్తారేమో అని చూస్తే అలాంటిదేమీ కనిపించదు. మరి ఈ కథను ఇలా ముగించడంలో జస్టిఫికేషన్ ఏంటన్నది అర్థం కాదు. ‘సుఖాంతం చేస్తే రొటీన్.. అలా కాకుంటే వైవిధ్యం’ అన్న ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ తో ఈ సినిమాను ఇలా ముగించారనిపిస్తుంది తప్ప ఈ ముగింపుతో ఏం చెప్పదలుచుకున్నారన్నది ప్రశ్నార్థకమే.

‘కలర్ ఫోటో’లో కొన్ని మెలిపెట్టే సన్నివేశాలున్నాయి. కొన్ని ప్రేమ సన్నివేశాలు హృద్యంగానూ అనిపిస్తాయి. కానీ వాటి ఆధారంగా ఇది ‘మంచి’ సినిమా అనేయలేం. ఒక మామూలు అబ్బాయిని ‘సోకాల్డ్’ హీరోయిజం చూపించకుండానే ఒక అందమైన అమ్మాయి ప్రేమించడం ఆసక్తి రేకెత్తించే అంశమే. అందులోనూ ఈ కాలం నాటి సెల్ ఫోన్ ప్రేమ కాకుండా.. 90ల నేపథ్యాన్ని ఎంచుకోవడం ద్వారా ఈ ప్రేమకథను మరింత అందంగా, హృద్యంగా చూపించడానికి మంచి సెటప్పే సిద్ధం చేసుకున్నారు కథకుడు, దర్శకుడు. కానీ ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమించడానికి తగ్గట్లుగా బలమైన, ఆసక్తికరమైన సన్నివేశాలు తీర్చిదిద్దుకోవడంలో విఫలమయ్యారు. హీరోయిన్ హీరోకు ఐలవ్యూ చెబుతుంటే.. ఈ అమ్మాయి ఇతణ్ని ఎందుకు ప్రేమించిందనే సందేహం ముందు ప్రేక్షకులకు కలుగుతుంది. వాళ్లిద్దరూ ప్రేమలోకి దిగాక కూడా ఆశించిన స్థాయిలో సన్నివేశాలు పడలేదు. అక్కడక్కడా కొన్ని మాటల చమక్కులు కనిపిస్తాయి తప్ప సన్నివేశాలు మాత్రం సాధారణమే. కామెడీ కోసం.. హీరో ఎలివేషన్ కోసం పెట్టిన కాలేజీ సన్నివేశాలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఇదంతా హీరోయిన్ చెప్పిన కట్టుకథ అంటూ తేల్చిపడేసిన ఒక ఎపిసోడ్.. డల్లుగా సాగే ‘కలర్ ఫోటో’లో కొంత కలర్ ఫుల్ గా అనిపిస్తుంది. రొటీన్ అయినా సరే.. అలా సినిమాను ముగించి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. హీరోను విలన్ హింసించే సన్నివేశంలో ఒక చోట ఎవ్వరికైనా గుండె మెలిపెడుతుంది. క్లైమాక్స్ సైతం ఇలాగే ఉంటుంది. ఒక భారమైన ఫీలింగ్ తో సినిమాను ముగిస్తాం. కానీ ఈ సినిమాకు సరైన ముగింపు ఇదే అని మాత్రం దర్శకుడు కన్విన్స్ చేయలేకపోయాడు.

నటీనటులు:

సుహాస్ జయకృష్ణ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. అతను మాత్రమే చేయదగ్గ పాత్ర అనిపిస్తాడు. అతడి రూపం - స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రకు కరెక్టుగా సరిపోయాయి. కొన్ని చోట్ల అతను కన్నీళ్లు పెట్టించే స్థాయిలో నటించాడు. ఈ పాత్రలో సుహాస్ ను చూశాక తెలుగు తెరకు మరో ‘నేచురల్ హీరో’ దొరికాడనిపిస్తుంది. విలన్ చేత హింసింపబడే సన్నివేశాల్లో.. పతాక సన్నివేశాల్లో సుహాస్ చాలా బాగా చేశాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరికి మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో తన ప్రతిభను చాటే అవకాశం ‘కలర్ ఫోటో’ ఇచ్చింది. ఆమె కూడా పాత్రకు చక్కగా సరిపోయింది. ఆమె అందం, అభినయం ఆకట్టుకుంటాయి. కాకపోతే డబ్బింగ్ దగ్గరే కొంచెం తేడా కొట్టింది. పాత్రకు తగ్గట్లుగా సహజంగా డైలాగ్స్ చెప్పలేకపోయింది. శేఖర్ కమ్ముల సినిమాల్లో అమ్మాయిల్లాగా పదాల్ని అదోలా పలికి ఇబ్బంది పెట్టింది. సునీల్ నెగెటివ్ రోల్ లో ‘ఫిట్’ అనిపించేందుకు బాగానే కష్టపడ్డాడు. తొలిసారి ఆ తరహా పాత్రలో ‘ఓకే’ అనిపించాడు. అతడి కామెడీ ఇమేజ్ ఈ పాత్రను డామినేట్ చేయలేదు. ఐతే కొన్ని చోట్ల మరీ అండర్ ప్లే చేయడం వల్ల ఆ పాత్ర ప్రభావం కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. కేరాఫ్ కంచెరపాలెం నటుడు రాజు హీరో తండ్రి పాత్రలో బాగానే చేశాడు. చిన్న పాత్రలో ఆదర్శ్ బాలకృష్ణ ఓకే అనిపించాడు.

సాంకేతిక వర్గం:

కాల భైరవ పాటలు - నేపథ్య సంగీతం రెండూ బాగున్నాయి. తరగతి గది.. .. పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. ముఖ్య సన్నివేశాల్లో ఫీల్ పెంచడంలో బ్యాగ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. సినిమా అంతిమంగా ఎలాంటి ఫీలింగ్ ఇచ్చినప్పటికీ కాలభైరవ మాత్రం సంగీత దర్శకుడిగా పూర్తి న్యాయం చేశాడు. వెంకట్ శాఖమూరి ఛాయాగ్రహణం కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. రెండు దశాబ్దాల కిందటి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆ ఫీల్ తీసుకురావడంలో కెమెరామన్ విజయవంతం అయ్యాడు. నిర్మాణ విలువలు ఓకే. కథకుడు సాయిరాజేష్ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కానీ దాన్ని అనుకున్నంత కన్విన్సింగ్ గా తెరపై ప్రెజెంట్ చేయలేకపోయాడు దర్శకుడు సందీప్ రాజ్. అతడిలో ప్రతిభ ఉన్న విషయంలో సినిమాలో కొన్ని చోట్ల కనిపిస్తుంది. సందీప్ కథన శైలిలో కొంచెం కొత్తదనం ఉన్నప్పటికీ.. ప్రేక్షకులు కోరుకునే హుషారు లేకపోవడం మైనస్. డల్లుగా సాగే నరేషన్.. అనవసర సన్నివేశాలతో అక్కడక్కడా అసహనానికి గురి చేశాడు. మరీ సటిల్ గా నరేట్ చేయాలని చూడటం ఈ తరహా సినిమాలకు సరిపోదు. కథలోని అత్యంత ముఖ్యమైన విషయాల్ని బలంగా, ప్రభావవంతంగా చెప్పలేకపోవడం బలహీనత. మెలోడ్రామా మరీ ఎక్కువైపోవడం ‘కలర్ ఫోటో’కు సమస్యగా మారింది.

చివరగా: కలర్ ఫోటో.. హై డోస్ మెలోడ్రామా!!

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre