సవరణ బిల్లుతో బ్లాక్ టికెటింగ్ దందాకు చెక్!

Wed Nov 24 2021 17:24:31 GMT+0530 (IST)

Cinematography Act Bill

ఆంధ్రప్రదేశ్ శాసనసభ లో ప్రవేశ పెట్టిన సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు ప్రకంపనాలు రేపుతోంది. దీని ప్రకారం ఇకపై సినిమా టికెట్లను ఆన్ లైన్ లో మాత్రమే కొనాలి.. బ్లాక్ దందా కుదరదని క్లారిటీ వచ్చేసింది. థియేటర్ల బయట బ్లాక్ టికెటింగ్ వ్యవస్థను ఇక నిర్మూలించనున్నారని అర్థమవుతోంది. ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ సవరణ బిల్లును మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు.ఇకపై నేరుగా థియేటర్ కు వెళ్లి టికెట్ కొనుగోలు చేసి సినిమా చూసే వెసులుబాటు లేదని సీఎం తరపున మంత్రి నాని బిల్లును ప్రవేశపెడుతూ వెల్లడించారు. కేవలం పోర్టల్ లోనే టికెట్ కొనాలని అన్నారు.

సినిమా అనగానే తమకి ఎదురుండకూడదన్న ధోరణిలో కొందరు ఉన్నారని పేద మధ్యతరగతి వర్గాల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారని  రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సినిమా షోలను ఇష్టానుసారంగా వేస్తున్నారని చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఇదంతా జరుగుతోందని అన్నారు. ఇష్టానుసారం ధరల్ని పెంచడాన్ని ఆపేందుకే ఈ బిల్లును తెచ్చామని అన్నారు. అంతేకాదు సినిమా అదనపు షోలను బెనిఫిట్ షోలను అదుపు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. కలెక్షన్లకు కట్టే పన్నులకు అస్సలు సంబంధం లేకుండా ఉందని నియమనిబంధనల ప్రకారం పరిశ్రమ నడవాలని మంత్రి నాని అన్నారు.

ప్రభుత్వ పోర్టల్ ద్వారా టికెట్ల అమ్మకంతో ప్రజలకు మంచి జరుగుతుందని అధిక ధరల దందా ఆగుతుందని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు- నిర్మాతలు- ఎగ్జిబిటర్లు అందరు తమ విధానాలను స్వాగతించారని పేర్కొన్నారు. ఆ మేరకు చట్టంలో మార్పులు చేశామని తెలిపారు.  నిర్మాతలు పంపిణీ వర్గాలతో చర్చించాకే ప్రభుత్వ పోర్టల్  సాఫ్ట్ వేర్ ను తీసుకొస్తామని మంత్రి వర్యులు అన్నారు.