Begin typing your search above and press return to search.

ముదురుతున్న వివాదం.. త‌ల‌సాని వ‌ద్ద‌కు పంచాయితీ!

By:  Tupaki Desk   |   23 Jun 2022 9:30 AM GMT
ముదురుతున్న వివాదం.. త‌ల‌సాని వ‌ద్ద‌కు పంచాయితీ!
X
తెలుగు సినీ కార్మికుల‌కు - ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ కు మ‌ధ్య వివాదం ముదురుతోందా? అంటే జ‌రుగుతున్న ప‌రిణ‌మాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. క‌నీసం వేత‌నాలు పెంచ‌డం లేదంటూ బుధ‌వారం సినీ కార్మికులు మెరుపు స‌మ్మెకు దిగిన విష‌యం తెలిసిందే. దీంతో చాలా వ‌ర‌కు సినిమాల షూటింగ్ ల‌కు బ్రేక్ ప‌డింది. ప్ర‌స్తుతం కార్మికుల బంద్ కార‌ణంగా మొత్తం 28 సినిమాల‌పై ఎఫెక్ట్ ప‌డింది. క‌నీస వేద‌నాల‌కు సంబంధించిన స‌మ్మె నోటీసుల‌ని మా దృష్టికి ఫెడ‌రేష‌న్ తీసుకురాలేద‌ని నిర్మాత‌ల మండ‌లి బుధ‌వారం స్టేట్ మెంట్ ఇచ్చింది.

అయితే ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు వ‌ల్ల‌భ‌నేని అనిల్ కుమార్ మాత్రం ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ కి ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ లెట‌ర్ లు ఇచ్చామ‌ని, మేము క‌నీస వేత‌నాల విష‌యాన్ని లేవ‌నెత్తిన ప్ర‌తీసారి నిర్మాత‌లు ఇత‌ర స‌మ‌స్య‌ల‌ని సాకుగా చెప్పేవార‌ని దీంతో స‌మ‌స్య ప‌రిష్కారం దిశ‌గా అడుగులు ప‌డ‌లేద‌ని ఆకార‌ణంగానే కార్మికులు షూటింగ్ ల బంద్ కు పిలుపునిచ్చార‌ని ప్ర‌క‌టించారు. అంతే కాకుండా పెంచిన వేత‌నాల ప్ర‌కార‌మే కార్మికులు షూటింగ్ ల‌లో పాల్గొంటార‌ని స్ప‌ష్టం చేశారు.

దీంతో వివాదం ముద‌ర‌డం మొద‌లైంది. దీనిపై అత్య‌వ‌రంగా స‌మావేశ‌మై నిర్మాత‌ల మండ‌లి కార్మికులు క‌నీస వేత‌నాలు పెంచ‌డానికి మాకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, అయితే స‌డ‌న్ గా కార్మికులు షూటింగ్ ల బంద్ కు పిలుపునివ్వ‌డం స‌మంజ‌సంగా లేద‌ని, కార్మికులు షూటింగ్ ల‌కు హాజ‌రైతేనే క‌నీస వేత‌నాల‌పై చ‌ర్చిస్తామ‌ని ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్ర‌క‌టించింది. అంతే కాకుండా పాత ప‌ద్ద‌తిలోనే 15 రోజుల పాటు కార్మికుల‌కు వేత‌నాలు చెల్లిస్తామ‌ని ఫిల్మ్ ఛాంబ‌ర్ నిర్మాత‌ల‌కు వెల్ల‌డించింది.

ఈ ప‌ద్ద‌తికి అంగీక‌రించ‌ని కార్మికుల పంచాయితీ ప్రస్తుతం సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ వ‌ద్ద‌కు చేరింది. ఈ నేప‌థ్యంలో ఫెడ‌రేష‌న్ నేత‌లు, ఫిల్మ్ ఛాంబ‌ర్ నిర్మాత‌లు వేరు వేరుగా మంత్రి త‌ల‌సానిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా షూటింగ్ లు ప్రారంభ‌మైతేనే వేత‌నాలు అని, ఎవ‌రితో ప‌ని చేయించుకోవాలో వారితోనే చేయించుకుంటామ‌ని, అవ‌స‌ర‌మైతే షూటింగ్ లు నిర‌వ‌ధికంగా ఆప‌డానికి కూడా తాము సిద్ధ‌మ‌ని నిర్మాత సి. క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు.

దీనిప మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ స్పందించారు. ఈ విష‌యంలో పంతాలు, ప‌ట్టింపుల‌కు పోవొద్ద‌న్నారు. ఈ విష‌యాన్ని ఇరు ప‌క్షాల‌కు తెలియ‌జేశానన్నారు. ఇరు వైపులా స‌మ‌స్య‌లు వున్నాయ‌ని, క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా కార్మికుల వేత‌నాలు పెర‌గ‌డం లేద‌న్నారు.

ఇరు ప‌క్షాలు చ‌ర్చించుకుని స‌మార‌స్యంగా స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించుకోవాల‌ని తాను సూచించాన‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రి కార్మికుల బంద్ కు తెర‌ప‌డేది ఎప్పుడు?.. షూటింగ్ లు మ‌ళ్లీ య‌ధావిధిగా సాగేది ఎప్పుడ‌న్న‌ది ఇంకా స్ప‌ష్ట‌త కావాల్సి వుంది.