అపర మేధావులకు అందని భగీరథుడు ది గ్రేట్ నోలాన్

Sat Jul 31 2021 13:01:03 GMT+0530 (IST)

Christopher Nolan Birthday Special

హాలీవుడ్ లెజెండ్ క్రిస్టోఫర్ నోలాన్ అసాధారణ మేధోతనం ఫిలిం మేకింగ్ క్వాలిటీస్ గురించి పరిచయం అవసరం లేదు. హాలీవుడ్ లో న్యూ జానర్ కంటెంట్ ని పరిచయం చేసిన దిగ్ధర్శకుడు. ఆ తర్వాత ఎంతోమంది నవతరం దర్శకులకు దార్శనికుడిగా అవతరించారు. ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో తనమైదన మార్క్ చూపించారు. ప్రేక్షకలోకానికి ఎన్నో థ్రిల్లర్ చిత్రాల్ని అందించి హాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఓ గొప్ప పేజీని రాసిపెట్టారు.1970  జులై 30న లండన్ లో  జన్మించిన క్రిస్టోఫర్ నోలన్ అందించిన కొన్ని టాప్ మూవీస్ పై స్పెషల్ ఫోకస్ ఇది.2000 ఏడాదిలో విడుదలైన `మెమెంటో` అప్పట్లో ఓ సంచలన సినిమా. ఇందులో మనిషి భావోద్వేగాలు.. జ్ఞాపకశక్తి అనే అంశాల్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు నోలాన్. గొప్ప మేధావిగా విమర్శకుల ప్రశంసలు దక్కాయి.  గైపియర్స్ లియోనార్డ్ షెల్బీ  తన పాత్రలో ఒదిగిపోయాడు. యాంటెరొగ్రేడ్ అమ్నిషీయా అనే జబ్బుతో బాధపడుతూ భార్యని హత్య చేసిన హంతకుడి కోసం వెతికే వ్యక్తి పాత్రలో గైపియర్స్ అద్భుతంగా నటించాడు.  ఆ తర్వాత 2006 లో రిలీజ్ అయిన `ప్రెస్టీజ్` కూడా క్రిస్టోఫర్  నోలాన్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. సైన్స్ ఫిక్షన్-సైకాలాజీకల్ థ్రిల్లర్ ని బేస్ చేసుకుని తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో హ్యూ జాక్మన్- క్రిస్టియన్ బేల్ బాగా నటించారు. విభిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన  మెజీషియన్ల మధ్య జరిగే ఆసక్తికర పోటీ పై కథతో తెరకెక్కించారు. కథనం ఆసక్తికరంగా సాగుతుంది.

ఇక 2008 లో రిలీజ్ అయిన `ది డార్క్ నైట్` ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది. డార్క్ నైట్ సిరీస్ లో రెండవ భాగమిది. హాలీవుడ్ బెస్ట్ కామిక్ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. 2000 దశాబ్ధపు ఉత్తమ చిత్రంగాను నిలిచింది. హాలీవుడ్ చిత్రాల్లో భారీ లాభాలు తెచ్చిపెట్టిన 19వ చిత్రంగా బాక్సాఫీస్ వద్ద నిలిచింది. ఇందులో జోకర్ పాత్రతో మెప్పించిన హిత్ లెడ్జర్ ఆ చిత్రానికి గాను ఆ ఏడాది ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఇక 2010 లో విడుదలైన `ఇన్ సెప్షన్` గురించి  చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ వైడ్ ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపేసిన చిత్రమిది. ఇండియాలో మారుమూల ప్రాంతాలకు ఈ సినిమా రీచ్ అయింది. అన్ని భాషల బాక్సాఫీస్ ల్ని షేక్ చేసిన చిత్రమిది. ఈ సినిమా ఏకంగా ఆ ఏడాది నాలుగు ఆస్కార్ అవార్డులను ఎగరేసుకుపోయింది.

అలాగే 2014 లో రిలీజ్ అయిన `ఇంటర్ స్టెల్లార్` చిత్రం ఓ వండర్. విశ్వంలో మానవాళి మనుగడకి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఇందులో ప్రతీ సన్నివేశం థ్రిల్లింగ్ కి గురిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన సినిమా ఇది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైనికుల కష్టాలపై తీసిన యాక్షన్ థ్రిల్లర్ `డన్ కిర్క్` ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇది గొప్ప ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా నిలిచింది. ఇంకా ఇలా మరెన్నో  అద్భుతాల్ని క్రిస్టోఫర్ నోలాన్ ప్రేక్షకులకు అందించారు.

అంతుచిక్కని గొప్ప థాట్స్ తో..

మనిషి మేధకు అందని గొప్ప థాట్స్ ని అతడు క్యాప్చుర్ చేసే విధానం ఆశ్చర్యపరుస్తుంది. ఏమిటీ అద్భుతం అంటూ కుర్చీ అంచున కూచుని ప్రేక్షకులు సినిమా చూడాల్సిందే. అసలు ఆలోచనా విధానం ఇలా కూడా ఉంటుందా? అనే డౌట్లు పుట్టించే కథల్ని కథనాల్ని ఎంచుకుని వండర్స్ చేయడం నోలాన్ ప్రత్యేకత. ఇక ఇన్సెప్షన్ అనే చిత్రాన్ని కొన్ని వందల సార్లు చూసిన పిచ్చి వీరాభిమానులు అతడికి మాత్రమే ఉన్నారు.