బాలయ్య vs నాగబాబు ఇష్యూకి ఫుల్ స్టాప్ పడినట్లేనా..?

Sun Jun 07 2020 11:31:25 GMT+0530 (IST)

Chiranjeevi Warns Nagababu Over His Controversy With Balakrishna

ఇటీవల సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ పెద్దల సమావేశానికి తనని పిలవనందుకు అసహనానికి గురై సినీ పరిశ్రమలో కొంతమంది భూములు పంచుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ బాలకృష్ణ జస్ట్ హీరో మాత్రమే కింగ్ కాదు.. వెంటనే సినీ ఇండస్ట్రీకి తెలంగాణా ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే బాలయ్య మాత్రం నాగబాబు మాటల్ని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. బాలయ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. "నాగబాబు వ్యాఖ్యలపై నేను మాట్లాడ్డానికి ఏముంది. ఛీ..ఛీ.. ఆయన వ్యాఖ్యలపై నేను మాట్లాడేదేంటి. ఇండస్ట్రీ అంతా నాకు మద్దతుగా ఉన్నప్పుడు నేను కొత్తగా ఏం మాట్లాడాలి. అందరికీ అన్నీ తెలుసు" అంటూ నాగబాబు వ్యాఖ్యలను బాలయ్య లైట్ తీసుకున్నాడు. అప్పటి నుండి సినీ ఇండస్ట్రీలో ఈ వివాదంపై దుమారం రేగుతూ ఉంది. టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు బాలయ్యకు మద్ధతు తెలపగా.. మరికొందరు ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ సమావేశాలకు అందర్నీ పిలవాల్సిన అవసరం లేదని.. బాలయ్య అవసరం అనుకుంటే ఖచ్చితంగా పిలుస్తామని చెప్పుకొచ్చారు. దీంతో ఇండస్ట్రీ రెండు వర్గాలుగా గ్రూపులుగా విడిపోయే అవకాశం ఉందంటూ కామెంట్స్ కూడా వినిపించాయి.అయితే ఇప్పుడు నాగబాబు ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నాడట. తాజాగా ఒక ప్రముఖ ప్రసార మాధ్యమానికి నాగబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యపై ఆయన చేసిన వ్యాఖ్యల వలన రాజుకున్న వివాదం ముగిసిపోయిన అధ్యాయమని చెప్పుకొచ్చాడట. ఆ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ బాలకృష్ణ వ్యాఖ్యలపై నేను రియాక్ట్ అయి అలా మాట్లాడటం తప్పు అని ఖండించాను. నేను బాలయ్య అలా ఆవేశపడి మాట్లాడటం తప్పని మాత్రమే చెప్పాను. దీనిపై బాలకృష్ణ రియాక్ట్ అవలేదు. దీంతో ఈ ఇష్యూకి ఇక్కడితో క్లోజ్ అయినట్లే అని చెప్పుకొచ్చారట. అంతేకాకుండా బాలయ్య వ్యాఖ్యలపై సి. కళ్యాణ్ తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వారు ఆయనతో మాట్లాడి సర్ది చెప్పారు. బాలకృష్ణ కోపంతో అలా మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి. ఈ ఇష్యూపై ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు అని నాగబాబు అన్నారట. అయితే వీడియోలో ఓ రేంజ్ లో బాలయ్యపై ఫైర్ అయిన నాగబాబు ఇప్పుడు ఇలా మాట్లాడటం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. నాగబాబు ఇప్పుడు ఇలా సౌమ్యంగా మాట్లాడటానికి మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్ - చిరంజీవి కారణమై ఉంటారని నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మెగా బ్రదర్స్ అనవసర గొడవలకి వెళ్ళొద్దని గట్టిగా నాగబాబుని హెచ్చరించి ఉంటారని.. అందుకే నాగబాబు ఈ ఇష్యూని పెద్దది చేయకుండా సైలెంట్ అవ్వాలని డిసైడ్ అయ్యుంటాడని అనుకుంటున్నారు. జనసేన పార్టీకి నాగబాబు వ్యాఖ్యల వలన రాజకీయంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన పవన్.. నాగబాబుకు గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వొద్దని చెప్పి ఉంటాడు. అందుకే నాగబాబు ఈ ఇష్యూ కి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నదంటూ డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూలో నాగబాబు భవిష్యత్ లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని.. జనసేన పార్టీ కోసం మాత్రం పని చేస్తానని కూడా చెప్పుకొచ్చారట. గత ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసి ఘోర పరాజయం పొందిన నాగబాబు ఒక ఏడాదిలోనే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.