సారుతో చిరు ఫోటోలతో కొత్త చర్చ..అలా అయ్యాడేమిటి?

Sat May 23 2020 13:00:52 GMT+0530 (IST)

Chiranjeevi Thanks KCR For Granting Film Shoots

టాలీవుడ్ పెద్దలంతా కలిసి సినిమా షూటింగ్ ల మీద ఒక నిర్ణయానికి రావటం.. లాక్ డౌన్ తో మొదలైన విరామానికి గుడ్ బై చెప్పేస్తూ.. మళ్లీ పనిలోకి వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వ అనుమతి కోసం పావులు కదపటం తెలిసిందే. ఇందులో భాగంగా సినీ పెద్దలంతా కలిసి కూర్చొని మాట్లాడుకోవటం.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అతిధిగా ఆహ్వానించి ఆయన ముందు తమ డిమాండ్లను పెట్టటం తెలిసిందే. షూటింగ్ ల అనుమతి గురించి ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పిన తర్వాతి రోజే.. సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వటం.. పరిశ్రమ పెద్దలంతా వెళ్లి కేసీఆర్ తో భేటీ కావటం తెలిసిందే.ఇదంతా ఇప్పటికే చాలాచోట్ల చూసే ఉంటారు. చదివే ఉంటారు. ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని చాలామంది మిస్ అయ్యారు. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వెళ్లిన టాలీవుడ్ ప్రముఖుల్లో అందరిలోనూ ప్రముఖంగా ఫోకస్ అయ్యింది మెగాస్టార్ చిరంజీవినే. కేసీఆర్ పక్కన నడుస్తూ.. మాట్లాడుకుంటున్న ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. కేసీఆర్ లాంటి బక్కపల్చటి వ్యక్తి పక్కన బొద్దుగా ఉండాల్సిన చిరు.. బరువు తగ్గినట్లుగా కనిపించారు.

కొద్ది నెలల ముందు కనిపించిన చిరుకు.. తాజాగా కనిపిస్తున్న చిరుకు పోలికే లేదంటున్నారు. చిరంజీవికి ఇప్పుడు 64 ఏళ్లు. తన వయసుకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో ఆయన ఫిట్ నెస్ ఉందంటున్నారు. నలభైల్లో ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్న చిరు.. ఇటీవల కాలంలో మరింత బరువు తగ్గినట్లుగా కనిపిస్తోంది. కొరటాల శివతో చేస్తున్న సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలకు అనుగుణంగా చిరు మారినట్లు చెబుతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున జిమ్ లో కష్టపడినట్లుగా తెలుస్తోంది. బక్కపల్చటి కేసీఆర్ పక్కన వెయిట్ తగ్గిన చిరు తీరు కొట్టొచ్చినట్లుగా కనిపించిందని చెప్పక తప్పదు. దీంతో.. చిరుకు ఏమైంది? ఇంతలా తగ్గిపోయారన్న ఆసక్తికర వాదన అంతకంతకూ ఎక్కువ అవుతోంది.