దిశ ఎన్ కౌంటర్ పై మెగా స్పందన

Fri Dec 06 2019 20:27:56 GMT+0530 (IST)

Chiranjeevi Responds on About Disha murder Accused Encounter

దిశ హత్యాచారంలో నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సెలబ్రిటీ ప్రపంచం దీనిపై ప్రశంసలు కురిపించింది. టాలీవుడ్ అగ్ర హీరోలు.. యువకథానాయకులు సహా కథానాయికలు పోలీసులు..ప్రభుత్వం చర్యను సపోర్ట్ చేశారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ ఎన్ కౌంటర్ పై స్పందించారు. తన అభిప్రాయం చెప్పారు. మెగాస్టార్ మాట్లాడుతూ... ``దోషులు మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం .. సహజ న్యాయం  అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు- ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే. అత్యంత దారుణం గా అత్యాచారానికి హత్యకు గురైన `దిశ` ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న `దిశ` తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి! ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృత్తం కాకుండా నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి`` అని అన్నారు.

కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయమని.. సజ్జనార్ లాంటి పోలీస్ ఆఫీసర్లు వున్న పోలీస్ వ్యవస్థకి.. కెసిఆర్ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.