ప్రాణాపాయంలో ఉన్న అభిమానికి మెగా అండ

Tue Aug 16 2022 18:57:57 GMT+0530 (IST)

Chiranjeevi Meets His Hardcore Fan Chakradhar In Hospital

ఎవరికి ఆపద వచ్చినా అది తనకు తెలిసిన వెంటనే వారిని ఆదుకునే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి ఆపద వస్తే ఊరుకుంటారా? వెంటనే రంగంలోకి దిగడమే కాక ఆయనను హైదరాబాద్ పిలిపించి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్ తన హీరో బాటలోనే సమాజ సేవలో ఎందరికో సాయం చేశారు. దొండపాటి చక్రధర్ పేదలకు చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావని మెగాభిమానులు చెబుతారు.ఎవరు కష్టంలో ఉన్నా వెంటనే స్పందించి వారి కుటుంబాలను మెగాభిమానుల తరపున ఆదుకున్న దొండపాటి చక్రధర్ కి క్యాన్సర్ అని తెలిసింది. గత కొన్నాళ్ల నుంచి దొండపాటి చక్రధర్ అనారోగ్యంతో ఉన్నారన్న విషయం మెగాస్టార్ చిరంజీవి కి తెలియగానే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్  తరలించారు. ఇటీవల క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆస్పత్రి ఒమేగా లో జాయిన్ చేసారు. అంతేకాదు ఆయన ఉన్న ఆసుపత్రికి సోమవారం సాయంత్రం  వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్కడి వైద్యులతో మాట్లాడి పరిస్థితి ఏమిటో తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే చక్రధర్ కు అండగా ఉంటామని ఆయన కుటుంబసభ్యలకు కూడా మెగాస్టార్ చిరంజీవి అభయం ఇచ్చారు.

మెగా సాయం అన్ లిమిటెడ్

కేవలం అభిమానుల కోసమే కాదు.. ప్రజల కోసం నిరంతరం మెగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కోవిడ్ సమయంలో ఎందరో మెగాభిమానులకు మెగాస్టార్ లక్షల్లో ఆపత్కాల సాయం అందించారు. దానిని ఇప్పటికీ అవిరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆపదలో ఉన్నానని అడిగితే కాదనకుండా సాయం చేయడం ఇటీవల చూస్తున్నదే. గతంలోనూ నటుడు పొట్టి వీరయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన చిరు జూనియర్ ఆస్టిస్టులు సీనియర్ ఆర్టిస్టుల్లో పేదలకు అండగా నిలిచారు.

అనారోగ్యంతో బాధపడే ఎందరో సినీకార్మికులు ఆర్టిస్టులకు చిరు సాయం అందించారు. కోవిడ్ సమయంలో సినీ  కార్మికుల్ని ఆదుకోవడానికి మెగాస్టార్ తీసుకున్న చొరవ గురించి చెప్పాల్సిన పనిలేదు. పూట గడవని కార్మికులకు నిత్యావసరాలు అందించి ఎంతో చేయూతనిచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేసి కోవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడటంలోనూ కీలక పాత్ర పోషించారు.

ఇంకా పరిశ్రమ తరుపున మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. ఆపదలో ఉన్న కార్మికుల్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉన్నారు. టిక్కెట్టు కష్టంలోనూ అందరికీ అండగా నిలిచి ప్రభుత్వాలతో మాట్లాడేందుకు చొరవ చూపారు. పరిశ్రమ కార్మికులకు అండగా నిలిచేందుకు ఆయన ప్రతిసారీ ముందుకొచ్చారు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల కోసం ఘనమైన ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎప్పటిలానే ఆగస్టు 22 మెగా బర్త్ డే రోజున మెగాభిమానులు భారీ సేవా కార్యక్రమాల కోసం ప్లాన్ చేశారని తెలిసింది.