అల్లు వారి పెళ్లిలో మెగాస్టార్ ఫ్యామిలీ

Fri Jul 19 2019 22:35:56 GMT+0530 (IST)

Chiranjeevi Attends For Allu Bobby marriage

కొన్ని రోజుల క్రితం అల్లు వారింట ఓ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అది అల్లు అరవింద్ పెద్ద కుమారుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నయ్య వివాహం. మొదటి భార్యతో ఓ పాపకు తండ్రైన అల్లు బాబీ ఆ తరువాత మనస్పర్ధల కారణంగా ఆమెతో విడిపోయి ఒంటరిగా వున్నారు. ఇదే దశలో అతనికి ముంబైకి చెందిన యోగా టీచర్ నీలాషాతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ఇటీవల నిరాడంబరంగా కుటుంబ సభ్యుల మధ్యే వీరి వివాహం జరిగింది. ఈ వివాహం వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అల్లు అర్జున్ కనిపించలేదని పెదవి విరిచారు.ఇది గమనించిన అల్లు బాబీ షూటింగ్ కారణంగా అల్లు అర్జున్ వివాహ వేడుకలో పాల్గొనలేకపోయాడని వివరణ ఇస్తూ రిసెప్షన్ సందర్భంగా తమ్ముడు అల్లు అర్జున్ ఫ్యామిలీతో దిగిన ఫోటోని షేర్ చేయడంతో అభిమానులు శాంతించారు. అయితే ఇదే వేడుకలో చిరంజీవి కుటుంబ సమేతంగా పాల్గొన్నారట. అయితే వారి ఫొటోల్ని మాత్రం బాబీ బయటపడనీయకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా వీరి ఫొటోలు కూడా బయటపడటంతో అల్లు వారి పెళ్లిలో మెగాస్టార్ ఫ్యామిలీ కూడా హంగామా చేసిందని మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారట. ఈ పెళ్లిలో బ్లూకలర్ కుర్తాలో మెగాస్టార్ గులాబీ రంగు వర్ణం కుర్తాలో రామ్‌చరణ్ లతో పాటు చిరు సతీమణి సురేఖ మనవరాలు నవష్కతో ఫొటోలకు పోజులిచ్చారు.

ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిరాడంబరంగా జరిగిన బాబీ పెళ్లికి చిరు రామ్‌చరణ్ కూడా ఎలాంటి ఆడంబరం లేకుండా కుర్తాల్లో హాజరు కావడం విశేషం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో రామ్‌చరణ్ నటిస్తూ బిజీగా వున్నారు. ఈ రెండు చిత్రాల్లో `సైరా` చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.