Begin typing your search above and press return to search.

ఆ కేసులో నటి భానుప్రియ అరెస్ట్ తప్పదా?

By:  Tupaki Desk   |   21 Sep 2019 5:12 AM GMT
ఆ కేసులో నటి భానుప్రియ అరెస్ట్ తప్పదా?
X
ఒక వెలుగు వెలిగిన నటి భానుప్రియ. డెబ్భై.. ఎనభైల్లో పుట్టిన వారికి సుపరిచితురాలైన సీనియర్ నటి భానుప్రియ.. ఇప్పుడు అరెస్ట్ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఏ క్షణంలో అయినా చెన్నై పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే వీలుందన్న మాట పోలీసు అధికారుల నోట వినిపిస్తోంది. ఇంతకీ ఆమె ఏ నేరం చేసింది? అరెస్ట్ ముప్పును ఎందుకు ఎదుర్కొంటున్నారు. అంత తీవ్రమైన నేరానికి భానుప్రియ పాల్పడ్డారా? అన్న వివరాల్లోకి వెళితే..

చెన్నైలోని ఒక ఫ్లాట్ లో నివసిస్తున్న భానుప్రియ.. ఇంటి పనుల కోసం ఒక మైనర్ బాలికను నియమించుకున్నారన్న ఆరోపణ కొంత కాలంగా వినిపిస్తున్నదే. అయితే.. తన ఇంట్లో పని చేసే పని పిల్ల చోరీకి పాల్పడిందంటూ గత ఏడాది జనవరి 19న చెన్నైలోని పాండిబజార్ పోలీస్ స్టేషన్లో భానుప్రియ.. ఆమె సోదరుడు గోపాలకృష్ణన్‌ కంప్లైంట్ చేశారు. ఆమెపై కేసు నమోదు చేయాలని కోరారు.

ఇదిలా ఉంటే.. సదరు పని పిల్ల తల్లి ప్రభావతి ఏపీలోని సామర్లకోటలో భానుప్రియ మీదా.. ఆమె సోదరుడిపైనా ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను ఇంట్లో నిర్బంధించి చిత్రవధకు గురి చేస్తున్నారని.. తన కూతుర్ని రక్షించాలని ఆమె కోరారు. దీంతో.. రంగంలోకి దిగిన సామర్లకోట పోలీసులు చెన్నైకి వచ్చి భానుప్రియను విచారించారు.

అదే సమయంలో నటి భానుప్రియ పెట్టిన కేసులో పనమ్మాయి తల్లి ప్రభావతిని అరెస్ట్ చేసి విచారించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ కేసుకు సంబంధించిన నేరం చెన్నైలో జరగటంతో సామర్లకోట కేసు చెన్నైకి తరలించారు. మరోవైపు నటి భానుప్రియపై బాలకార్మికుల చట్టం కింద కేసు నమోదు చేశారు చెన్నైపోలీసులు. ఈ కేసులో నటి భానుప్రియను ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. అయినా.. ఇంట్లో పనికి పెట్టుకునేటప్పుడు.. పని వారి వయసు విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న చిన్న విషయాన్ని అంత పెద్ద సెలబ్రిటీ భానుప్రియ ఎలా మిస్ అయినట్లు?