చిలసౌ టీజర్: ప్రతి ఒక్కడికీ కత్రినా కైఫ్ కావాలి

Wed Jul 11 2018 18:44:45 GMT+0530 (IST)

ఈమధ్య ఫిల్మ్ పబ్లిసిటీలో కొత్త సంప్రదాయం మొదలైంది. మామూలుగా అయితే టీజర్ - ఆ తర్వాత ట్రైలర్ ని విడుదల చేసేవాళ్లు. ఆ రెండింట్లోనూ హీరో - హీరోయిన్లు కనిపించేవాళ్లు. డైలాగులు కూడా చెరీ సగం షేర్ చేసుకొనేవాళ్లు. ఇప్పుడు మాత్రం హీరోకొక టీజర్ - హీరోయిన్ కొక టీజర్ అనే సంప్రదాయం మొదలైంది.అక్కినేని కథానాయకుడు సుశాంత్ నటించిన చిలసౌ పబ్లిసిటీ విషయంలోనూ అదే జరిగింది.  కథానాయకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. సుశాంత్ - రుహానీ శర్మ జంటగా నటించారు. సల్మాన్ అభిమాని - ఆంజనేయ భక్తుడు అంటూ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇంతకుముందే విడుదలైంది. అందులో హీరో  తన గురించి చెప్పుకుంటూ అలరించాడు.  ఈరోజు హీరోయిన్ టీజర్ విడుదల చేశారు.  అందులో రుహానీశర్మ అందంగా కనిపించింది. ఆమె చెప్పిన సంభాషణలు కూడా చాలా బాగున్నాయి. ``ప్రతి ఒక్కడికీ కత్రినా కైఫ్ కావాలి. కానీ ఎవ్వడూ రణ్ బీర్ లా ఉండడు`` అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ టీజర్ కి ఆకర్షణగా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి విడుదలవుతుండడంతో ఈ సినిమాని నాగచైతన్య తన భుజ స్కందాలపై వేసుకొని ప్రమోట్ చేస్తున్నాడు. మరి వరుస పరాజయాలతో సతమతమవుతున్న సుశాంత్‌కి ఈ చిత్రంతోనైనా కలిసొస్తుందేమో చూడాలి.