Begin typing your search above and press return to search.

'చెక్' కచ్చితంగా డిఫరెంట్ మూవీ అవుతుంది: రాజమౌళి

By:  Tupaki Desk   |   21 Feb 2021 5:20 PM GMT
చెక్ కచ్చితంగా డిఫరెంట్ మూవీ అవుతుంది: రాజమౌళి
X
తెలుగులో విభిన్నమైన చిత్రాల దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటికి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తెరపై చూస్తున్నట్టుగా కాకుండా మన కళ్లముందు ఆ కథ జరుగుతున్నట్టుగా .. ఆ పాత్రలు మన మధ్యలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'చెక్' సినిమాలో నితిన్ - ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించారు. రకుల్ .. సంపత్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది.

ఈ వేదికపై నితిన్ మాట్లాడుతూ .. "గతంలో తాను రాజమౌళి దర్శకత్వంలో 'రగ్బీ' ఆట నేపథ్యంలో చేసిన 'సై' తన కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచిందనీ, అలాగే 'చదరంగం' నేపథ్యంలో రూపొందిన 'చెక్' కూడా భారీ విజయాన్ని సాధించడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చంద్రశేఖర్ యేలేటి గారి వలన, నటనలో తాను మరిన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం కలిగిందని అన్నాడు. ఇక వరుణ్ తేజ్ మాట్లాడుతూ, తాను ఇక్కడికి నితిన్ స్నేహితుడిలా మాత్రమే వచ్చానని అన్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలంటూ టీమ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు అందజేశాడు.

ఇక రాజమౌళి మాట్లాడుతూ .. "ఈ మధ్య కాలంలో .. టీజర్ చూడగానే సినిమాకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సినిమా ఏదైనా ఉందీ అంటే అదీ 'చెక్' మాత్రమే. చంద్రశేఖర్ యేలేటి ఎంచుకున్న థీమ్ బాగుంది. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు వైవిధ్యభరితమైన కథలను ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాలకి మాస్ - క్లాస్ అనే తేడాలు ఉండవు. అలా అన్నిరకాల ప్రేక్షకులు ఈ సినిమాకి వస్తారనేది నా నమ్మకం. నితిన్ ఒక ఇమేజ్ కి కట్టుబడిపోకుండా తనని తాను మలచుకుంటూ .. మార్చుకుంటూ వస్తున్నాడు. ఎలాంటి కథనైనా చేయగలడని నిరూపించుకుంటున్నాడు. ఇది ఆయనకి తప్పకుండా డిఫరెంట్ మూవీ అవుతుంది. ఇక కల్యాణి మాలిక్ చేసిన సాంగ్ .. రీ రికార్డింగ్ చాలా బాగున్నాయి. ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుంది" అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశాడు.