Begin typing your search above and press return to search.

'RC15' తర్వాత చరణ్ చేసే సినిమా అదేనా..?

By:  Tupaki Desk   |   2 Aug 2021 2:30 PM GMT
RC15 తర్వాత చరణ్ చేసే సినిమా అదేనా..?
X
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ 'సాహో' సినిమా తర్వాత తదుపరి ప్రాజెక్ట్ పై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలని సుజీత్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే చరణ్ కు స్టోరీ లైన్ కూడా వినిపించగా.. హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదనే టాక్ ఉంది. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితో 'లూసిఫర్' తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల సుజీత్ ఆ ప్రాజెక్ట్ ని వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ చరణ్ ప్రాజెక్ట్ లైన్ లోకి వచ్చిందని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

కథ చెప్పి చాలా కాలంగా వెయిటింగ్ లిస్ట్‌ లో ఉన్న సుజీత్ కు రామ్ చరణ్ పాజిటివ్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చరణ్ కమిటైన సినిమాలు పూర్తైన తర్వాత వీరి ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది చివరలో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని టాక్. సుజీత్ తో రెండు సినిమాలు చేసిన యూవీ క్రియేషన్స్ వారు చెర్రీతో చేసే చిత్రానికి కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారట. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే కొరటాల శివ డైరెక్షన్ లో తన తండ్రితో చేస్తున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. ఇదే క్రమంలో శంకర్ దర్శకత్వంలో చెర్రీ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారని సమాచారం. ఈ క్రమంలోనే సుజీత్ సినిమా ఉంటుందని టాక్.

ఇకపోతే 'రన్ రాజా రన్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజీత్.. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను మెప్పించాడు. దీంతో 'బాహుబలి' తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తో 'సాహో' సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాబట్టలేకపోయినా.. హిందీలో మాత్రం సత్తా చాటింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యంగ్ డైరెక్టర్.. 'ఆర్ ఆర్ ఆర్' 'RC15' చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయే రామ్ చరణ్ ని డైరెక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది.