సల్మాన్ లా ఫామ్ హౌస్ కి వెళుతున్న చరణ్?

Thu Apr 22 2021 15:00:01 GMT+0530 (IST)

Charan going to Farm House?

కరోనా వైరస్ మహమ్మారీ సెలబ్రిటీల్ని వెంటాడి వేధిస్తున్న సంగతి తెలిసిందే. బయట కనిపిస్తే చాలు వెంబడిస్తోంది. ముఖ్యంగా సినిమా షూటింగులకు వెళ్లే క్రమంలో ఇది ఎవరిని ఎలా వెంటాడుతోందో అర్థం కాని పరిస్థితి. ప్రతిసారీ మాస్క్ ధరించినా  జాగ్రత్తలు తీసుకున్నా సమస్య ఏ రకంగా అయినా వెంటాడే పరిస్థితి ఉంది. అందుకే చాలా మంది సెలబ్రిటీలు షూటింగులు ఆపేసి ఫామ్ హౌస్ లకు వెళుతున్నారు.బాలీవుడ్ లో చాలామంది స్టార్లు పూర్తిగా ఫామ్ హౌస్ లకే అంకితమయ్యారు. అందులో భాయ్ సల్మాన్ ఖాన్ అయితే ఏకంగా ఏడాది కాలంగా పన్వేల్ ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. అదే తరహాలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఫామ్ హౌస్ కి వెళ్లనున్నారని సమాచారం.

తెలుగురాష్ట్రాల్లో కోవిడ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దీని ప్రభావం చిత్రపరిశ్రమపై తీవ్రంగా ఉంది. ఇటీవల పవన్ కల్యాణ్ కోవిడ్ భారిన పడిన సంగతి తెలిసిందే. అంతకుముందే చిరంజీవి- రామ్ చరణ్ కూడా కోవిడ్ పాజిటివ్ రావడంతో చికిత్సతో కోలుకున్నారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ్యక్తిగత వానిటీ బస్సు డ్రైవర్ కరోనా వైరస్  సంబంధించిన సమస్యలతో పోరాడుతూ ఇటీవల కన్నుమూశారు. తన టీమ్ సభ్యుని మరణం చెర్రీని తీవ్రంగా కలచివేసిందట.

పరిస్థితి తీవ్రతను గ్రహించిన రామ్ చరణ్ ప్రస్తుతం బాహ్య ప్రపంచం నుండి దూరంగా వెళ్లాలనుకున్నారు. పూర్తిగా ఒంటరిగా ఉండేలా ఏదైనా ఫామ్ హౌస్ కి వెళ్లాలని నిశ్చయించుకున్నారని తెలుస్తోంది. చరణ్ - చిరంజీవి ఫ్యామిలీకి బెంగళూరు పరిసరాల్లోని డీప్ ఫారెస్ట్ పరిసరాల్లో కొన్ని ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది. ఇదే పరిసరాల్లో రజనీకాంత్ కి ఫామ్ హౌస్ ఉంది. తమ ఫామ్ కి చెర్రీ వెళతారని ఊహాగానాలు సాగిస్తున్నారు. అయితే కేవలం చరణ్ మాత్రమేనా కుటుంబ సమేతంగా వెళతారా? అన్నదానిపై క్లారిటీ రాలేదు. కరోనా తీవ్రత దృష్ట్యా నెలరోజుల పాటు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు వెళ్లడం సురక్షితం కాదని అంతా భావిస్తున్నారు. ముంబైలో సెలబ్రిటీలంతా ఇంటికే అంకితమైన సంగతి తెలిసిందే.