యేలేటి సినిమా.. ఎట్టకేలకు అనౌన్స్ చేశారబ్బా

Thu Mar 21 2019 22:20:56 GMT+0530 (IST)

Chandrasekhar yaleti Movie With Nithin

తెలుగులో గొప్ప అభిరుచి ఉన్న దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి ఒకడు. ‘ఐతే’.. ‘అనుకోకుండా ఒక రోజు’.. ‘ఒక్కడున్నాడు’.. ‘ప్రయాణం’.. ‘సాహసం’.. ‘మనమంతా’.. ఈ చిత్రాల వరుస చూస్తేనే యేలేటి టాలెంట్ ఏంటన్నది అర్థమవుతుంది. కానీ కమర్షియల్‌గా పెద్ద విజయాలు అందుకోకపోవడంతో ఆయన కెరీర్ ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. సినిమా సినిమాకూ ఆయన ఎక్కువ గ్యాప్ తీసుకోవాల్సి వస్తోంది. ‘మనమంతా’ తర్వాత మూడేళ్లకు పైగా అతను ఖాళీగా ఉన్నాడు. మధ్యలో యేలేటి సినిమా అంటూ రకరకాల కాంబినేషన్లలో అతడి పేరు వినిపించింది. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. చివరగా నితిన్ హీరోగా యేలేటి సినిమా అన్నారు. ఆ తర్వాత చప్పుడు లేదు. ఐతే చివరికిప్పుడు ఈ చిత్రమే ఖరారైంది. ఎట్టకేలకు ఈ సినిమా గురించి ప్రకటన కూడా వచ్చింది. స్వయంగా హీరో నితినే ఈ చిత్రాన్ని ప్రకటించాడు.‘శ్రీనివాస కళ్యాణం’ తర్వాత ఇప్పటిదాకా నితిన్ తన కొత్త సినిమా మొదలుపెట్టలేదు. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుములతో అతను ‘భీష్మ’ చిత్రం చేస్తాడని ఇంతకుముందు ప్రకటన వచ్చింది. కానీ అది ముందుకు కదల్లేదు. దాని సంగతేమో కానీ.. యేలేటితో సినిమాను మాత్రం నితిన్ కన్ఫమ్ చేశాడు. ఈ రోజు హోలీ సందర్భంగా ట్విట్టర్లో ఈ సినిమా గురించి వెల్లడించాడు. సుప్రీంలీ టాలెంటెడ్ చంద్రశేఖర్ యేలేటితో సినిమా చేస్తున్నట్లు చెబుతూ.. ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ‘భవ్య’ ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తాడని వెల్లడించాడు. ఇంతకుముందు యేలేటి సినిమాలు ‘అనుకోకుండా ఒక రోజు’.. ‘ఒక్కడున్నాడు’లకు సంగీతాన్నందించిన ఎం.ఎం.కీరవాణే ఈ చిత్రానికి కూడా పని చేయనున్నట్లు నితిన్ తెలిపాడు. ఏప్రిల్ మధ్యలో చిత్రీకరణ మొదలవుతుందని.. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తానని నితిన్ తెలిపాడు. మొత్తానికి యేలేటి కొత్త సినిమా కన్ఫమ్ కావడంతో ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.