Begin typing your search above and press return to search.

బాబు చంపేస్తాడు..నిజంగా చంపేసిన వర్మ!

By:  Tupaki Desk   |   9 Dec 2019 10:37 AM GMT
బాబు చంపేస్తాడు..నిజంగా చంపేసిన వర్మ!
X
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఇంట్రో ఏం ఇస్తాం..? అందుకే డైరెక్ట్ గా టాపిక్ లోకి పోదాం. వర్మ దర్శకత్వం వహించిన కొత్త సినిమా 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' 12 వ తేదీ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ టార్గెట్ ఆడియన్స్ ను విపరీతంగా మెప్పించింది. టార్గెట్ చేసిన సెక్షన్ కు విపరీతంగా చిరాకు తెప్పించింది. ఏకకాలంలో ఈ క్లిష్టమైన పని చేసిన వర్మ మరోసారి అదేపని మరోసారి చేస్తూ ఈ సినిమా నుండి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఒక తుపాకి తూటా లాంటి పాటను వదిలాడు.

'చంపేస్తాడు' అంటూ సాగే ఈ పాటకు సాహిత్యం అందించిన వారు సిరాశ్రీ. ఈ పాటను స్వరపరిచిన వారు రవి శంకర్. ఈ పాటను స్వయంగా వర్మ గారే తన గాత్రంతో శత్రువుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా.. సింహనాదం వినిపించేలా ఆలాపించారు. "గంగవీటి భవానీ గారు ఎంత మంచివారంటే.. వాళ్ల నాన్న గంగవీటి గంగా గారిని మర్డర్ చేయించింది మనమే అని తెలిసి కూడా మన పార్టీలో చేరారు" అంటూ లోకేష్ ను పోలిన వ్యక్తి పబ్లిక్ స్పీచ్ ఇస్తూ ఉంటారు. పక్కనున్న వ్యక్తి "చినబాబు.. మీరలాంటివి మాట్లాడకూడదు" అంటూ ప్రేమతో ఒక సున్నితమైన సూచన చేస్తాడు. అప్పుడు లోకేష్ పాత్రధారి కొనసాగిస్తూ "ఇలాంటి అమాయకుల మీద జులుం చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారేమో.. వాళ్లకు ఇంకా మా నాన్న సంగతి తెలీదు" అంటాడు. అప్పుడు "చంపేస్తాడు చంపేస్తాడు.. " అంటూ రామ్ గోపాల్ వర్మ అమరగానం మొదలవుతుంది.

"చెంప మీద కొడితే తట్టుకోగలడు.. కాళ్ల మధ్య తంతే నిలదొక్కుకోగలడు. కానీ....... అహం మీద కొడితే...చంపేస్తాడు.. చంపేస్తాడు.. బాబు చంపేస్తాడు" అంటూ బాబు పాత్రధారి విజువల్స్ ను చూపిస్తూ వర్మ తన నేపథ్యంగానంతో పాటను పీక్స్ లో కి తీసుకెళ్లాడు. ఈ పాటను సంగీతపరంగా చూడడం పరమ మూర్ఖత్వం. ఇది పొలిటికల్ సెటైర్ అనే పదానికి సరైన ఉదాహరణ. నిజానికి ఒక పాటకు మంచి గాత్రం ఉంటేనే అది రక్తి కడుతుంది లేకపోతే విరక్తి పుడుతుంది. ఈ పాట పూర్తిగా రివర్స్. ఎంత విరక్తి పుట్టేలా పాడితే అంత రక్తి కడుతుంది. ఆ బాధ్యతను వందశాతం నిర్వర్తించి పాటను అజరామరం చేశారు శ్రీమాన్ రామ్ గోపాల్ వర్మ గారు. ఇంతకంటే ఎక్కువ వివరించడం ఇల్లాజికల్లీ లాజికల్ అండ్ మోరల్లీ ఇమ్మోరల్. పాట వినండి.. పాత్రధారుల హావ భావాలను పరిశీలించండి. పాట ఎలా ఉంది అని ఒక్క ముక్కలో చెప్పాలంటే.. అరాచకం.