Begin typing your search above and press return to search.

సినిమాల విడుదల విషయంలో టాలీవుడ్ కు ఎదురయ్యే సవాళ్లు..!

By:  Tupaki Desk   |   16 Jun 2021 4:30 PM GMT
సినిమాల విడుదల విషయంలో టాలీవుడ్ కు ఎదురయ్యే సవాళ్లు..!
X
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం నుంచి టాలీవుడ్ నెమ్మదిగా బయటకు వస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టి లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఇప్పటికే 'మాస్ట్రో' వంటి కొన్ని సినిమా షూటింగులు తిరిగి ప్రారంభమయ్యాయి. జూన్ నెలాఖరు నుంచి 'ఆర్‌.ఆర్‌.ఆర్' 'ఆచార్య' 'రాధే శ్యామ్' 'పుష్ప' వంటి పాన్ ఇండియా సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. వీటితో పాటుగా 'శాకుంతలం' 'థాంక్యూ' 'ఖిలాడి' 'ఎఫ్‌ 3' 'పక్కా కమర్షియల్‌' 'అఖండ' 'కార్తికేయ 2' వంటి సినిమాలు కూడా స్టార్ట్ కానున్నాయి. ఇకపోతే జూలై రెండో వారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లు రీ ఓపెన్ అవుతాయని ప్రచారం జరుగుతోంది. 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని అంటున్నారు. అయినప్పటికీ సినిమాల విడుదల విషయంలో నిర్మాతలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు.

ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో లాక్‌ డౌన్‌ నిబంధనలు సడలించినా ప్రస్తుతం నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. అంటే థియేటర్లు తెరుచుకున్నా నైట్ షోలకు అవకాశం ఉండదు. అందుకే రాత్రిపూట కర్ఫ్యూ పూర్తిగా తొలగించిన తర్వాతే సినిమా విడుదలల గురించి ఆలోచించాలని భావిస్తున్నారట. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన వారం తర్వాత 'లవ్ స్టోరీ' సినిమాని విడుదల చేయాలని అనుకుంటున్నామని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలు సవరించడం కూడా మేకర్స్ కు ఆందోళన కలిగిస్తోందట. టికెట్ ధరలు పునఃపరిశీలించిన తర్వాత థియేటర్స్ తెరవాలని పలువురు ఎగ్జిబిటర్లు అభిప్రాయ పడుతున్నారట. అందుకే టాలీవుడ్ ప్రముఖులు త్వరలోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ఈ విషయంపై చర్చించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఏదేమైనా సినిమాల విడుదల విషయంలో తొందరపడకుండా ముందుచూపుతో వ్యవహరించాలని నిర్ణయానికి వస్తున్నట్లు అర్థం అవుతోంది.