వర్మ కి చెక్ పెట్టబోతున్న సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్...!

Sun Jul 12 2020 14:00:40 GMT+0530 (IST)

Central government rules to check Varma ...!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. గత నాలుగు నెలలుగా ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ఓటీటీలనే ఆశ్రయిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సన్ నెక్స్ట్ ఆల్ట్ బాలాజీ జీ 5 ఎం ఎక్స్ ప్లేయర్ ఎరోస్ ఆహా అని చాలా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్ లు వీక్షకులకు అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొనివున్న పరిస్థితుల వలన క్రేజీ మూవీస్ కూడా ఈ ఓటీటీలలో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నా. అయితే ఓటీటీలలో వచ్చే కంటెంట్ మీద అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. వెబ్ కంటెంట్ కి సెన్సార్ కూడా లేకపోవడంతో మేకర్స్ రెచ్చిపోయి అస్లీల దృశ్యాలు.. అస్లీల కంటెంట్ చూపించేస్తున్నారు. దీంతో ఫ్యామిలీతో కలిసి ఓటీటీలలో వచ్చే కంటెంట్ ని చూడాలంటే ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి.ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో యథేచ్ఛగా అసభ్య కంటెంట్ ప్రసారం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. వెబ్ కంటెంట్ కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. అంతేకాకుండా విదేశీ కంటెంట్ అనువాదానికి కూడా ఓ హద్దు ఉంటుందని.. మన దేశ సంస్కృతీ సాంప్రదాయాలు సమాజం నైతిక విలువలు దృష్టిలో పెట్టుకొని అనువాదాలు చేయాలని అభిప్రాయపడ్డారు. ఇక ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్వీయ నియంత్రణ ఉండాలని పేర్కొన్నారు. సెంట్రల్ మినిస్టర్ వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే వెబ్ కంటెంట్ మీద రూల్స్ పెట్టే ఆలోచన చేస్తున్నారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే కనుక జరిగితే అసభ్య కంటెంట్ చూపించే మేకర్స్ కి ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ కంటెంట్ కి ఎలాంటి షరతులు లేకపోవడంతో పలువురు దానిని క్యాష్ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వారికి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ పెడితే ఇబ్బందే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల వర్మ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ని వాడుకొని అస్లీల కంటెంట్ ఓ రేంజ్ లో చూపిస్తున్నాడు. దీనికి కోసం సొంతంగా 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' అనే ఏటీటీ ఫ్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసి దాంట్లో తనకు ఇష్టమొచ్చిన కంటెంట్ వదులుతున్నారు. ఇప్పటికే రిలీజైన 'క్లైమాక్స్' 'నగ్నం' సినిమాలనే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వీటికి మించి అసభ్య కంటెంట్ చూపించడానికి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో సెంట్రల్ మినిస్టర్ చెప్పినట్లు నియంత్రణ చేస్తే రామ్ గోపాల్ వర్మ లాంటి మేకర్స్ కి చెక్ పెట్టినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.