సెన్సార్ రిపోర్ట్: పూరీ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'లైగర్'

Fri Aug 05 2022 16:00:01 GMT+0530 (India Standard Time)

Censor Report: Puri marks Liger as mass action entertainer

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరియు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ''లైగర్'' (సాలా క్రాస్ బ్రీడ్) సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మరో 20 రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.ఇప్పటికే వచ్చిన 'లైగర్' ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. 2 గంటల 20 నిమిషాలు (140 నిమిషాలు) నిడివితో ఈ చిత్రానికి 'U/A' (యు/ఎ) సర్టిఫికెట్ లభించింది.

'లైగర్' ఫస్ట్ హాఫ్ 1 గంట 15 నిమిషాలు.. సెకండాఫ్ 1 గంట 5 నిమిషాల రన్ టైం వచ్చింది. ఏడు ఫైట్లు - ఆరు పాటలతో పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నటన ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తుందని సెన్సార్ రిపోర్ట్ చెబుతోంది.

ఇందులో యాక్షన్ సీన్స్ మరియు క్రేజీ మాస్ డ్యాన్స్ లతో విజయ్ అదరగొట్టాడని అంటున్నారు. ఈ అంశాలు ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా ఉండబోతున్నాయి. పూరీ మార్క్ క్యారెక్టరైజేషన్ - నత్తి ఉన్న యువకుడిగా VD డైలాగ్ డెలివరీ మరియు  బాడీ లాంగ్వేజ్ విశేషంగా ఆకట్టుకోనున్నాయి

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో తెరకెక్కిన 'లైగర్' సినిమాలో ఎంఎంఏ ఫైటర్ గా కనిపించడానికి విజయ్ చాలా కష్టపడ్డాడు. అతని మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ 'లైగర్' తో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నాడు.

విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించగా.. సినిమాలో తల్లీ కొడుకుల మధ్య సెంటిమెంట్ బాగా పండిందని తెలుస్తోంది. అలానే విజయ్ దేవరకొండ - హీరోయిన్ అనన్య పాండేల లవ్ ట్రాక్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. క్లైమాక్స్ ఎపిసోడ్ హైలెట్స్ లలో ఒకటిగా నిలుస్తుంది.

'లైగర్' చుట్టూ నెలకొన్న హైప్ మరియు సెన్సార్ రిపోర్ట్ ని బట్టి చూస్తే ఈ సినిమాతో పూరీ - విజయ్ కలిసి పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకోబోతున్నారనిపిస్తోంది. విష్ణు శర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా.. కెచా స్టంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

పూరీ కనెక్ట్స్ - ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 25న తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో 'లైగర్' సినిమాని భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.