మహేశ్ సినిమాలో అలాంటివి ఊహించగలమా..?

Fri May 13 2022 15:09:52 GMT+0530 (IST)

Can you imagine such a thing in a Mahesh movie

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అయితే పరశురాం పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. డివైడ్ టాక్ తెచ్చుకుంది. మహేష్ స్టార్ డమ్ ఈ మూవీని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది? ఎంత వసూళ్ళు చేస్తుంది? అనేది పక్కన పెడితే.. ఇందులో కొన్ని డైలాగ్స్ మరియు సీన్స్ పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.సినిమాలో సుబ్బరాజును మహేష్ చికాకు పెట్టే ఓ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. అందులో ఒక సీన్ కామెడీ కోసం చేసినప్పటికీ.. అది నవ్వు పుట్టించలేదు సరికదా.. స్క్రీన్ పై వెగటుగా కనిపించిందని కామెంట్స్ వస్తున్నాయి. దర్శకుడు తెలివిగా ఆ సన్నివేశానికి సంబంధించిన ఎలాంటి విజువల్స్ ను చూపించలేదు కానీ.. అదే విషయాన్ని సినిమాటిక్ గా తెలియజేసారు.

అయితే ఈ సన్నివేశం మహేష్ బాబు లాంటి స్టార్ హీరో స్థాయిని కించపరిచేలా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మహేష్ సినిమాల్లో ఇలాంటి సీన్స్ ఉంటాయని అనుకోలేదని.. ఇది ఒక విధంగా సుబ్బరాజు పాపులారిటీని కూడా అగౌరవపరుస్తుందని అంటున్నారు. మహేశ్ తన ఇమేజ్ ని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని.. ఇలాంటి సీన్ చేయకుండా ఉండాల్సిందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
 
అలానే కీర్తి సురేష్ ను మహేశ్ బాబు కొట్టే సీన్ పై కూడా కొందరు ఫీమేల్ ఆడియన్స్ అభ్యంతరం తెలుపుతున్నారు. అయితే అక్కడ కీర్తి ముందు వెన్నెల కిషోర్ ని కొట్టడమే కాకుండా.. నిన్ను కూడా కొడతా అని వార్నింగ్ ఇచ్చింది కాబట్టి.. మహేశ్ అలా చేయడంలో తప్పమీ లేదని మరికొందరు అంటున్నారు.
   
ఇక సినిమాలో 'వయాగ్రా' డైలాగ్ మరియు 'ఎందుకంటే.. వాడిది మరీ.. పెద్ద..' అంటూ మహేష్ చెప్పే డబుల్ మీనింగ్ డైలాగ్ పై పలువురు పెదవి విరుస్తున్నారు. వీటిపై అభిమానుల నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.. ఎప్పుడూ డిగ్నిటీగా ఉండే మహేష్ నోటి నుంచి ఇలాంటి డైలాగ్స్ ఊహించలేదని ఓ వర్గం ఆడియన్స్ అంటున్నారు.

ఏదేమైనా మహేశ్ బాబు లాంటి అగ్ర హీరో తన సినిమాల్లోని ప్రతి సన్నివేశాన్ని - డైలాగ్ ను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలు జనాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఇతర నటీనటులతో పోలిస్తే బిగ్ స్టార్స్ మరింత జాగ్రత్తగా ఉండటం.. మంచి కంటెంట్ తో ముందుకు రావడం అనేది అదనపు బాధ్యత అని చెప్పాలి.

హీరోలు అలా వ్యవహరించకపోతే అది సమాజంలో వారికున్న గౌరవాన్ని ప్రభావితం చేయడమే కాకుండా.. నేటి తరం ప్రేక్షకులపై అనవసరమైన నెగెటివ్ అభిప్రాయాన్ని కూడా సృష్టిస్తుంది. 'సర్కారు వారి పాట' సినిమాకు వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే చిత్రాలలో మహేశ్ అలాంటి సన్నివేశాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.