Begin typing your search above and press return to search.

#థియేట‌ర్స్‌.. తెలంగాణలో లిట్మ‌స్ టెస్ట్ పాస‌య్యేనా?

By:  Tupaki Desk   |   22 July 2021 2:30 AM GMT
#థియేట‌ర్స్‌.. తెలంగాణలో లిట్మ‌స్ టెస్ట్ పాస‌య్యేనా?
X
క‌రోనా దెబ్బ‌కు థియేట‌ర్ వ్య‌వ‌స్థ ఒక్క‌సారిగా కుప్ప కూలింది. కంటికి క‌నిపించిన వైర‌స్ అన్ని రంగాల‌ను మించి సినిమా రంగాన్ని అత‌లాకుత‌లం చేసింది. తొలిసారి లాక్ డౌన్ ప్ర‌క‌ట‌న మొద‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ పరిస్థితులు కుదుటప‌డ‌లేదు. ద‌శ‌ల వారిగా కొన్ని అనుమ‌తులు ప‌రిమితంగా ల‌భించిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల భ‌యం ఎగ్జిబిట‌ర్ల‌ను న‌ష్టాల్లోకి నెట్టింది. పాక్షికంగా థియేట‌ర్లు తెరుచుకున్న‌ప్ప‌టికీ బిజినెస్ మాత్రం ఆశించినంత‌గా సాగ‌లేదు.

దాదాపు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా రెండు వేవ్ ల్లోనూ ఇదే ప‌రిస్థితి. ఆగ‌స్టు నుంచి థ‌ర్డ్ వేవ్ ప్రారంభమ‌వుతుంద‌న్న సంకేతం అందుతోంది. ఒక వైపు ప్ర‌భుత్వాలు థియేట‌ర్లు అన్ లాక్ చేసినా తెలంగాణలో ఒక ర‌క‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తుంటే...ఏపీలో మ‌రో ర‌క‌మైన ప‌రిస్థితి తో ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ప్ర‌స్తుతానికి తెలంగాణ ప్ర‌భుత్వం థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌కు పూర్తి స్వేచ్ఛ‌ను ఇవ్వ‌డంతో పాటు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లో పార్కింగ్ ఫీజు వ‌సూలుకు అనుమ‌తిచ్చింది.

ఇది కొంత మేర ఎగ్జిబిట‌ర్ల‌కి క‌లిసొచ్చే అంశ‌మే అయినా...థియేటర్ యాజ‌మాన్యాల్ని మాత్రం మ‌రోవైపు రెట్టించిన భ‌యం వెంటాడుతూనే ఉంది. ఇక ఏపీలో రాత్రిపూట క‌ర్ఫ్యూని ఇటీవ‌లే మ‌ళ్లీ వారం రోజుల పాటు పొడిగించారు. ఆ నిబంధ‌న లేక‌పోయి ఉంటే తెలంగాణ తో పాటు ఏపీలో ఎగ్జిబిట‌ర్ల‌కు ఇంకాస్త క‌లిసొచ్చేది. అయిన‌ప్ప‌టికీ తెలంగాణ‌లో ఈనెల 30 నుంచి థియేట‌ర్లు ఓపెన్ చేయ‌డానికి రంగం సిద్ద‌మ‌వుతోంది.

బిగ్ స్క్రీన్స్ లో రిలీజ్ చేయాల‌నుకున్న నిర్మాత‌ల‌కు ఇది మంచి అవ‌కాశ‌మే. కానీ ప్రేక్ష‌కులు థ‌ర్డ్ వేవ్ ముందు థియేట‌ర్ల‌ వైపు మ‌ళ్లుతారా? అన్న‌ది సందేహ‌మే. ఇక ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లో మార్నింగ్ షో.. మ్యాట్నీ.. ఫ‌స్ట్ షోలకు అడ్డంకి లేదు. మ‌ల్టీప్లెక్స్ ల్లో టైమ్ అడ్జ‌స్ట్ మెంట్ ని బ‌ట్టి షోలు ప‌డే అవ‌కాశం రాత్రి 9 గంట‌ల వ‌ర‌కూ ఉంటుంది. అయితే ఇక్క‌డ షో టిక్కెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డం ఎగ్జిబిట‌ర్ల‌ని బ‌య్య‌ర్ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తుంది.

ప్రస్తుత ప‌రిస్థితుల్లో 50 శాతం ఆక్యుపెన్సీ త‌గ్గిన ధ‌ర‌ల‌తో సినిమా రిలీజ్ చేస్తే లాభాలు ఎలా? అన్న భ‌యం వెంటాడుతోంది. మ‌రి ఇవ‌న్నీ తొల‌గిపోవాలంటే? కొన్ని వెసులు బాట్ల‌తో పాటు థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం పై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బిగ్ స‌ర్కిల్ లో సినిమా రిలీజ్ అనేది ఎగ్జిబిట‌ర్లు డిస్ట్రిబ్యూట‌ర్లు,.. నిర్మాత‌లు డేరింగ్ చేసి ముందుకు వ‌స్తే త‌ప్ప ప్రేక్ష‌కుల నాడిని ప‌ట్టుకోవ‌డం కష్టమే. ముందుగా తెలంగాణలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబ‌ట్టి అక్క‌డ ప‌రిస్థితిని బ‌ట్టి ఏపీలో జ‌నాల మైండ్ సెట్ మారే అవ‌కాశ‌మైతే ఉంటుంద‌ని ఆశిస్తున్నారు.

స‌త్తా ఉన్న‌వి రిలీజ్ కొస్తున్నాయి:
ప్ర‌స్తుతం ఓటీటీకి స్కిప్ కొట్టి థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం నాని న‌టిస్తున్న ట‌క్ జ‌గ‌దీష్.. రానా విరాఠ‌ప‌ర్వం స‌హా ప‌లు చిత్రాలు వెయిటింగ్ లో ఉన్నాయి. ఇవ‌న్నీ బ్యాక్ టు బ్యాక్ రిలీజై స‌క్సెస్ సాధిస్తాయ‌నే ఆశిస్తున్నారు. థియేటర్ల వైపు ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షించే స‌త్తా ఉన్న చిత్రాలు మునుముందు రిలీజ్ ల‌కు రెడీ అవుతున్నాయి.