కపూర్ బోయ్ టాలీవుడ్ లో విలన్ గా నటిస్తాడా?

Sun Jul 03 2022 09:55:20 GMT+0530 (IST)

Can Ranbir Kapoor Act As Villan In Tollywood

అవును.. అతడి గుండె ముక్కలైంది!  పెళ్లయిన తర్వాత సదరు హీరోగారు ఈ మాట అన్నందుకు అభిమానులు కంగారు పడాల్సినదేమీ లేదు. అతడి గుండె ముక్కలవ్వడానికి కారణం ఒక ఫ్లాప్ సినిమా. తానొకటి తలిస్తే దైవమొకటి తలచిన చందంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుందని భావిస్తే అంతిమంగా ఫ్లాప్ షోగా నిలిచింది. ఆ సినిమా కథాంశం గొప్పది. తన పాత్ర ఇంకా గొప్పది. తాను ఎంతో ఇన్వాల్వ్ అయ్యి నటించాడు. ఆ దర్శకుడు కూడా గొప్ప ట్యాలెంటెడ్. కానీ పరాజయం ఎదురైంది. దాంతో అతడి హృదయం ముక్కలైంది! ఇంతకీ ఈ మాట చెప్పిన పెళ్లయిన హీరో ఎవరు? అంటే.. రణబీర్ కపూర్. తాను ఎంతో ఆశిస్తే `రాకెట్ సింగ్` చిత్రం తన గుండెను ముక్కలు చేసిందని అతడు నివేదించాడు.రణబీర్ కపూర్ కొంతకాలంగా మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. ఆలియా భట్ తో అతని వివాహం .. త్వరలో తండ్రిగా ప్రమోషన్.. విడుదలకు సిద్ధమవుతున్న తాజా చిత్రం షంషేరా ఇవన్నీ హెడ్ లైన్స్ లో వార్తలుగా నిలిచాయి. వాస్తవానికి కపూర్ బోయ్ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో నటించిన శంషేరా చిత్రానికి ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితిలో పాన్ ఇండియా హిట్టు కొట్టాలన్న పంతంతో ఉన్నాడు.

ప్రమోషన్లలో భాగంగా రణబీర్ అటు హిందీ మీడియాతో పాటు ఇటు తెలుగు తమిళ మీడియాలతోనూ సంభాషిస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో రణబీర్ రకరకాల విషయాలను ప్రస్థావించాడు. అందులో `రాకెట్ సింగ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్` బాక్సాఫీస్ వద్ద అండర్ పెర్ఫార్మెన్స్ చేయడం తన గుండెను ముక్కలు చేసిందని అన్నాడు. యే జవానీ హై దీవానీలో షారుఖ్ ఖాన్ లాగా నటించడం ఎంతో ఉత్సాహం నింపిందని.. `వేక్ అప్ సిద్`లో భావోద్వేగంతో కూడిన ప్రయత్నం చేసానని కూడా చెప్పాడు.

రాకెట్ సింగ్ తన హృదయాన్ని ఎందుకు విచ్ఛిన్నం చేసిందనే విషయాన్ని రణబీర్  ప్రస్థావించాడు. నేను అలాంటి ప్రతిభావంతుడైన..  అలాంటి అద్భుతమైన దర్శకుడు షిమిత్ అమీన్ తో కలిసి పనిచేశాను. ఇది అద్భుతమైన స్క్రిప్ట్.. అద్భుతమైన పాత్ర.. ఈ సినిమాలో కాస్త కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ ఈ సినిమాను ఇందులో నా క్యారెక్టర్ ని మెచ్చుకునే చాలా మంది ఉన్నారు. మా అమ్మ నేను సర్దార్ జీగా నటించడంతో చాలా సంతోషించింది. అయితే ఈ సినిమా బాగా ఆడకపోవడంతో నా గుండె ముక్కలైంది! అని అన్నాడు.

ఇంటర్వ్యూలో తన చిత్రం వేక్ అప్ సిద్ .. యే జవానీ హై దీవానీల పై స్పందిస్తూ రణబీర్ ఈ చిత్రాలు తనకు ఎందుకు దగ్గరగా ఉన్నాయో వివరించాడు. వేక్ అప్ సిద్ విషయానికొస్తే.. రణబీర్ తన పాత్ర తన మొదటి పే చెక్ ని తన తండ్రికి ఇచ్చే సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇది సినిమాలో తనకు అత్యంత ఇష్టమైన సన్నివేశాలలో ఒకటి అని పేర్కొన్నాడు. షూటింగ్ విషయానికొస్తే.. నిజ జీవిత సన్నివేశంలోని ఉద్వేగం కాబట్టి ఇందులో సులువుగా నటించానని తెలిపాడు.

యే జవానీ హై దీవానీ కథ షారుఖ్ ఖాన్ కనెక్ట్ తో కొనసాగుతూ స్వయం ప్రకటిత SRK అభిమాని ట్రెక్కింగ్ సమయంలో దీపికా పదుకొణెతో   ప్రేమ అనే కోణంలో సాగుతుంది. తనలాంటి అమ్మాయిలు సరసాలాడడానికి కాదు.. నిజమైన ప్రేమ కోసం పుడతారని.. నిజమైన ప్రేమ తనకు మంచిది కాదని చెబుతుంది ఆ పాత్ర. ఈ డైలాగ్ ఎందుకు ఎక్సైట్ చేసిందో చెబుతూ.. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగేలో షారుఖ్ ఖాన్ చెప్పే మాటలను ఇవి పోలి ఉన్నాయని.. తాను కింగ్ ఖాన్ కి చాలా పెద్ద అభిమానిని కాబట్టి అతనిలా నటించడానికి చాలా సంతోషిస్తున్నానని రణబీర్ చెప్పాడు.

రణబీర్ తదుపరి పీరియాడికల్ యాక్షన్ చిత్రం శంషేరాతో అభిమానుల ముందుకు రానున్నాడు. బ్లాక్ బస్టర్ `సంజు` తర్వాత నాలుగు సంవత్సరాలకు శంషేరాతో తిరిగి అలరించేందుకు వస్తున్నాడు. శంషేరా- బ్రహ్మాస్త్ర చిత్రాలతో పాన్ ఇండియా హిట్టు కొట్టాలని కసిగా ఉన్నాడు. తాజాగా ఓ ప్రచార వీడియోలో విలన్ గా నటించాలనుందని తన ఆసక్తిని కూడా వ్యక్తం చేసాడు. షోలే లో గబ్బర్ సింగ్ గా అమ్జద్ ఖాన్ ..అగ్నిపథ్ లో చీనాగా సంజయ్ దత్ లా.. పద్మావత్ లో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రధారి రణ్‌వీర్ సింగ్ లా.. డర్ లో షారుక్ ఖాన్ లా చేయాలని ఉందని రణబీర్ అన్నారు. మేము ఎప్పుడూ హీరోగానే నటిస్తున్నా కానీ  హీరోయిజం చూపించడానికి విలన్ లేకపోతే హీరో ఎలా హీరో అవుతాడు? అని ప్రశ్నించాడు. ఏదో ఒక రోజు విలన్ గా నటిస్తానని కూడా ఆశాభావం వ్యక్తం చేసాడు.

సినిమా అభివృద్ధి చెందుతున్న కొద్దీ విలన్ పాత్ర కూడా మరింత క్లిష్టంగా ఆసక్తికరంగా మారుతోంది. మనం ఇంకా చూడని బ్యాడ్ విలన్లు చాలా మంది ఉన్నారు. భయపెట్టే నటుల కోసం నేను ఎదురు చూస్తున్నాను. చెడును రీడిఫైన్ చేసే ప్రతినాయకులు కావాలి! అని రణబీర్ అన్నాడు. అంతా బాగానే ఉంది కానీ..టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరో నటించే సినిమాలో రణబీర్ కి విలన్ పాత్రను ఆఫర్ చేస్తే చేస్తాడా?  కేజీఎఫ్ విలన్ లాంటి భీకరమైన పాత్రకు అతడికి ఓకే చెప్పే గట్స్ ఉన్నాయా? అన్నదానికి సమాధానం కావాలి. రణబీర్ నటించిన త్రిభాషా చిత్రం శంషేరా హిందీ- తమిళం- తెలుగు లో జూలై 22న విడుదలవుతోంది.