పోసాని నన్ను వెనక్కి పంపించేయాలని చూశారు: బీవీఎస్ రవి

Thu Jun 24 2021 06:00:01 GMT+0530 (IST)

Bvs Ravi Talking About Posani Krishna Murali

బీవీఎస్ రవి మంచి రచయిత. పెద్ద బ్యానర్లు .. స్టార్ హీరోలతో నిర్మితమైన సినిమాలకు సైతం ఆయన పనిచేశారు. ఆయన కథలను అందించిన చాలా సినిమాలు భారీ విజయాలను సాధించాయి. సంభాషణలను సమకూర్చే విషయంలోను తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఒక కథలో ఏయే అంశాలు ఉండాలో .. ఏ విషయాన్ని ఎక్కడ దాచాలో .. ఎక్కడ చెప్పాలో  ఆయనకి బాగా తెలుసు. చాలా సినిమాలకు రచయితగా పనిచేసిన ఆయన ఈ మధ్య నటన వైపు .. దర్శకత్వం వైపు కూడా అడుగులు వేశారు. తాజా ఇంటర్వ్యూలో తన గురించి ఆయన అనేక విషయాలను చెప్పుకొచ్చారు."మొదటి నుంచి కూడా నాకు సినిమాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. రచయితగా మంచి పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఇండస్ట్రీకి రావడానికి కొరటాల శివ కారణమైతే ఇక్కడ నిలదొక్కుకోవడానికి కారణం పోసాని కృష్ణమురళిగారు. కొరటాల శివ నాకు క్లాస్ మేట్ .. ఆయనకి మేనమామనే పోసాని కృష్ణమురళి గారు. అలా కొరటాల ద్వారా నేను పోసానిగారిని కలిశాను. రైటర్ గా సినిమాల వైపు రావాలని ఉందంటూ నా మనసులోని మాటను ఆయనతో చెప్పాను. ఇక్కడ చాలా కష్టాలు పడవలసి ఉంటుందంటూ చదువు పూర్తిచేసి మంచి ఉద్యోగం చేసుకోమని చెప్పారు.

మొదటిరోజున ఆయన నన్ను బెడ్ రూమ్ లో కూర్చోబెట్టి మాట్లాడారు .. ఆ తరువాత డ్రాయింగ్ రూమ్ లో కూర్చోబెట్టి మాట్లాడారు. మూడో రోజున ఆయన కోసం హాల్లో వెయిట్ చేయవలసి వచ్చింది. అలా నేను ఒక 6 నెలల పాటు ఆయన కోసం వెయిట్ చేశాను. ఆ తరువాత ఆయన నన్ను పిలిచి "నువ్వు వెనక్కి వెళ్లిపోయి హాయిగా ఏదైనా ఉద్యోగం చేసుకుంటావనే ఉద్దేశంతోనే అలా వెయిట్ చేయించాను" అని చెప్పారు. నా పట్టుదల అర్థమై చివరికి ఓకే అన్నారు. అప్పటి నుంచి శిష్యా .. శిష్యా అంటూ నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. ఆయన దగ్గర నేను చాలా వర్క్ నేర్చుకున్నాను" అని చెప్పుకొచ్చారు.