నాగ చైతన్యను వాడుకోబోతున్న అఖిల్..!

Tue Sep 21 2021 12:20:03 GMT+0530 (IST)

Buzz On Most eligible bachelor Trailer

అక్కినేని నట వారసత్వాన్ని కొనసాగించడానికి కింగ్ నాగార్జున బాటలో ఆయన ఇద్దరు కుమారులు నాగచైతన్య - అఖిల్ లు కూడా హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇద్దరూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి శాయశక్తులా కష్టపడుతున్నారు. ప్రస్తుతం చెరో రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. చైతన్య 'లవ్ స్టోరీ' 'థాంక్యూ' సినిమాలు చేస్తుంటే.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' 'ఏజెంట్' చిత్రాల్లో అఖిల్ నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు అఖిల్ తన సినిమా కోసం సోదరుడు చైతూ చిత్రాన్ని ఉపయోగించుకోబోతున్నాడని తెలుస్తోంది.



శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన ఫీల్ గుడ్ ప్రేమకథా చిత్రం ''లవ్ స్టోరీ''. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ఈ సినిమాని సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే 'లవ్ స్టోరీ' సినిమా విడుదలయ్యే థియేటర్లలో.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'  చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

యూత్ కింగ్ అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్''. యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేకర్స్.. రెగ్యులర్ గా అప్డేట్స్ వదులుతూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'లవ్ స్టోరీ' సినిమాకు బ్యాచిలర్ ట్రైలర్ ను జత చేస్తున్నారు.

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంతో అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అక్కినేని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.