చెప్పుకోడానికి 8 రిలీజులున్నా ఒక్కదానికీ బజ్ లేదు..!

Wed Aug 17 2022 14:45:10 GMT+0530 (IST)

But there is no buzz for any of them..!

టాలీవుడ్ బాక్సాఫీస్ కు నూతనోత్సాహం వచ్చింది. జులై నెలలో రిలీజైన సినిమాలన్నీ తీవ్రంగా నిరాశపరచగా.. ఆగస్ట్ మొదటి రెండు వారాల్లోనే మూడు బ్లాక్ బస్టర్స్ అందుకోవడం అందరిలో జోష్ నింపింది. 'బింబిసార' 'సీతారామం' మరియు 'కార్తికేయ 2' వంటి మూడు చిత్రాలు థియేటర్లకు మళ్లీ కళ తీసుకొచ్చాయి. ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుని.. నిర్మాతలను లాభాల బాట పట్టించాయి.మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ప్రేక్షకులు ప్రూవ్ చేశారు. అలానే ఇన్నాళ్లూ జనాలు థియేటర్లకు రావడం లేదని భయపడిన ఫిలిం మేకర్స్ అంతా హుషారుగా ఉన్నారు. వరుస పెట్టి సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారంలో థియేటర్లలోకి వచ్చే సినిమాల మీద అందరి దృష్టి పడింది.

ఆగస్టు మూడో వారంలో ఏకంగా ఎనిమిది సినిమాలు బరిలో దిగుతున్నాయి. ఈ నెల 18న తమిళ హీరో ధనుష్ హీరోగా నటించిన "తిరు" అనే డబ్బింగ్ మూవీ విడుదల కాబోతోంది. ఇందులో రాశీ ఖన్నా - నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఉన్నట్టుండి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈ సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు.

ఆది సాయి కుమార్ నటించిన 'తీస్ మార్ ఖాన్' సినిమా ఈ నెల 19న షెడ్యూల్ చేయబడింది. సరైన సక్సెస్ కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఆది.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఇందులో 'Rx100' హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీపై ఆది చాలా హోప్స్ పెట్టుకున్నారు.

ఇదే వారంలో బోల్డ్ కంటెంట్ తో ఓ వర్గం ఆడియన్స్ దృష్టిలో పడిన 'కమిట్మెంట్' సినిమా రిలీజ్ కానుంది. అలానే 'వాంటెడ్ పండుగాడ్' 'మాటరాని మౌనమిది' 'అంఅః' 'లవ్ 2 లవ్' 'నా వెంటపడుతున్న చిన్నవాడెవరమ్మా' వంటి చిన్నా చితకా చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాయి.

అయితే పేరుకి అర డజనుకు పైగా సినిమాలు విడుదల అవుతున్నా.. అందులో ఒక్క దానికీ ఆశించిన స్థాయిలో క్రేజ్ లేదు. దీనికి తగ్గట్టుగానే ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ డే టాక్ వీటి భవితవ్యం డిసైడ్ చేస్తుంది. మంచి కంటెంట్ ఉండి టాక్ బాగుంటే వారాంతంలో వసూళ్ళు రాబట్టొచ్చు.

ఎంత బాగున్నా ఫస్ట్ వీక్ లోనే మంచి కలెక్షన్స్ కు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే తర్వాతి వారంలో వినాయక చవితి ని టార్గెట్ చేస్తూ క్రేజీ చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి వచ్చే వారం రిలీజ్ అయ్యే చిత్రాల్లో ఏవేవి బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొనేలా చేస్తాయో చూడాలి.