Begin typing your search above and press return to search.

'బ్యాచ్ లర్' ద్వారా చెప్పాలనుకున్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే: బన్నీ వాసు

By:  Tupaki Desk   |   14 Oct 2021 5:37 AM GMT
బ్యాచ్ లర్ ద్వారా చెప్పాలనుకున్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే: బన్నీ వాసు
X
అఖిల్ తాజా చిత్రంగా రేపు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' థియేటర్లలో దిగిపోనుంది. విజయదశమి కానుకగా గీతా ఆర్ట్స్ 2 వారు అందిస్తున్న సినిమా ఇది. బన్నీవాసు - వాసు వర్మ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనుంది. బన్నీ వాసు కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " అఖిల్ ఇంతకు ముందు యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్న సినిమాలు చేశాడు. అలాగే శ్రీమంతుల బిడ్డగా కనిపించాడు.

అందుకు భిన్నంగా ఆయనను ఈ సినిమాలో చూపించాలని అనుకున్నాము. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక సాధారణమైన కుర్రాడిగానే ఈ సినిమాలో ఆయన కనిపిస్తాడు. భారీ యాక్షన్ సీన్లు గానీ .. హెవీ ఎమోషనల్ సీన్స్ గాని ఇందులో ఉండవు. యూత్ ఎంతవరకూ మోయగలదో అంతవరకూ మాత్రమే మిగతా అంశాలను వినోదానికి చుట్టూ అల్లుతూ వెళ్లడం జరిగింది. సున్నితమైన ప్రేమ .. ఆ ప్రేమ గాఢతను తెలియజెప్పే భావోద్వేగాలు తెరపై చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా హీరో హీరోయిన్లలో తమని తాము చూసుకునేలా ఈ సినిమా ఉంటుంది.

ఏదో కాసేపు కాలక్షేపం చేయించి థియేటర్ల నుంచి పంపించే ఉద్దేశంతో ఈ సినిమా చేయలేదు. పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి? పెళ్లి తరువాత ఎలా నడుచుకోవాలి? అనే అంశాన్ని ఈ సినిమా చర్చిస్తుంది. తల్లితండ్రులు తమ పిల్లలకు చెప్పకుండా వదిలేసే సున్నితమైన అంశాలను ఈ సినిమాలో ఆవిష్కరించడం జరిగింది. పెళ్లి అయినవారికీ .. కానీ వారికి కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చే సినిమా ఇది. ఒక బలమైన బంధాన్ని ఎలాంటి సున్నితమైన అంశాలు నిలబెడతాయనే అంశమే ఈ కథలోని ఇంట్రెస్టింగ్ పాయింట్. దీనికి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు.

'బొమ్మరిల్లు' భాస్కర్ తన సినిమాలకి సంబంధించిన స్క్రిప్ట్ పై ఎక్కువ కసరత్తు చేస్తాడు. పూర్తి క్లారిటీ వచ్చిన తరువాతనే సెట్స్ పైకి వెళతాడు గనుక, చకచకా లాగించేస్తాడు. కరోనా కారణంగా ఈ సినిమా ఆలస్యమైంది. ఇక వాసువర్మ విషయానికి వస్తే, కథల విషయంలో .. వాటికి సంబంధించిన స్క్రిప్ట్స్ విషయంలో క్లారిటీ కోసం నేను ఎక్కువగా వాసు వర్మతో చర్చిస్తూ ఉంటాను. అటు అల్లు స్టూడియో .. ఇటు గీతా ఆర్ట్స్ 2 .. కంటెంట్ పెంచాలని అనుకున్న కారణంగా, వాసువర్మ వంటివారిని కొంతమందిని తీసుకున్నాం. త్వరలో ఐదారు ప్రాజెక్టులు ప్రకటిస్తాం.

అల్లు అర్జున్ - బోయపాటి సినిమాకి సంబంధించిన చర్చలు కూడా నడుస్తున్నాయి. ఈ విషయంలోను అప్పటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది" అని చెప్పుకొచ్చాడు. గతంలో బోయపాటి - అల్లు అర్జున్ కాంబినేషన్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే 'సరైనోడు' సినిమా వచ్చింది. ఈ సినిమాతో ఆ బ్యానర్ కి బోయపాటి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఈ మధ్య ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రానుందనే ప్రచారం జరుగుతూనే ఉంది. దాంతో బన్నీ వాసు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడన్న మాట. కాస్త ఆలస్యమే అయినా మరోసారి ఈ కాంబినేషన్ సెట్ కావడం ఖాయమేననే విషయం మాత్రం అర్థమవుతోంది.