బ్రేకింగ్: ఐసోలేషన్ లో టాలీవుడ్ టాప్ -6 హీరోలు

Thu Apr 22 2021 17:00:02 GMT+0530 (IST)

Breaking: Tollywood Top-6 Heroes in Isolation

టాలీవుడ్ ని దశాబ్ధాలుగా శాసిస్తున్న అరడజను మంది యువ స్టార్ హీరోలు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ మహమ్మారీ ధడ పుట్టిస్తూ ఒక్కొక్కరిని వెంబడిస్తుంటే వైరస్ నుంచి తప్పించుకునేందుకు ఎవరికి వారు డాక్టర్ల సమక్షంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సన్నివేశం మునుపెన్నడూ ఊహించనిది. ఒక రకంగా భయానకమైనదని విశ్లేషిస్తున్నారు.ఓవైపు వరుసగా సినీసెలబ్రిటీలంతా కోవిడ్ బాధితులుగా మారుతుంటే సదరు స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా షూటింగులు బంద్ చేసి ఇండ్లలోనే ఒక సపరేట్ గదిని ఎంపిక చేసుకుని బయటకు రావడం లేదు.  ఈ జాబితా అంతకంతకు పెరుగుతోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. డార్లింగ్ ప్రభాస్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరంతా ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. స్వీయనిర్భంధంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ కోవిడ్ -19 కు పాజిటివ్ వచ్చిందని తెలియగానే ప్రభాస్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు .. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గదిలో నిర్భంధంగా ఉన్నారు.

మహేష్ వ్యక్తిగత స్టైలిస్ట్ కి `సర్కారు వారి పాట` సెట్స్ లో వైరస్  పాజిటివ్ వచ్చింది. ఇది తెలుసుకున్న మహేష్ తన కుటుంబ వైద్యుడిని సంప్రదించారు. వెంటనే ముందు జాగ్రత్త చర్యగా స్వీయ-నిర్భంధంలోకి వెళ్లారు. ప్రస్తుతం సర్కార్ వారి షూటింగ్ వాయిదా పడింది.  మే నెలలో షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.

కరోనా వైరస్ తో పోరాడుతూ తన వ్యక్తిగత వానిటీ వ్యాన్ డ్రైవర్ ఇటీవల కన్నుమూసిన తరువాత మెగా హీరో రామ్ చరణ్ కూడా ఒంటరిగా ఉన్నారు. చరణ్ ఇంతకుముందు వైరస్ పాజిటివ్ కి చికిత్స పొంది కోలుకున్న సంగతి తెలిసినదే. అతను ఇప్పుడు కఠిన నియమాలు పాటిస్తూ ఒంటరిగా ఉన్నాడు. బయటి ప్రపంచం నుండి తనను తాను పూర్తిగా డిస్కనెక్ట్ చేశాడు. పరిశ్రమ స్నేహితులంతా ఐసోలేషన్ లో ఉండగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటున్నారని సమాచారం. ఆర్.ఆర్.ఆర్ షూట్ ప్రస్తుతానికి నిలిపివేశారు. ఆచార్య చిత్రీకరణను చిరంజీవి స్వచ్ఛందంగా నిలిపివేశారు.

ఖిలాడి దర్శకుడు రమేష్ వర్మ కరోనావైరస్ పాజిటివ్ రాగానే.. రవితేజ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. డాక్టర్ వద్ద పరీక్షలు చేయించుకున్నారు.  నాని.. నాగ చైతన్య వంటి యువ నటులు తమ తదుపరి ప్రాజెక్టుల షూటింగ్ లో ఉన్నారు.  సెకండ్ వేవ్ వల్ల చాలా మంది నటీనటులు ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. మునుముందు మరిన్ని షూటింగులకు బ్రేక్ పడుతుందని ఇతర హీరోలు స్వీయనిర్భంధం పాటించే అవకాశం ఉందని సన్నివేశం చెబుతోంది. కరోనా మరో నెలపాటు ఉగ్రరూపంలోనే ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని స్టార్లు కోరుతున్నారు.