Begin typing your search above and press return to search.

నేను ఫస్టు టైమ్ ఫ్లైట్ ఎక్కింది మెగాస్టార్ తోనే

By:  Tupaki Desk   |   24 Nov 2021 4:16 AM GMT
నేను ఫస్టు టైమ్ ఫ్లైట్ ఎక్కింది మెగాస్టార్ తోనే
X
తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు తీయిస్తున్న నటుడిగా బ్రహ్మానందం కనిపిస్తారు. దశాబ్దాలుగా ఆయన ప్రయాణం కొనసాగుతున్నా ఎవరికీ ఇంతవరకూ బోర్ కొట్టలేదు. ఒక వైపున సీనియర్ స్టార్స్ తో .. మరో వైపున యంగ్ హీరోలతో కలిసి కామెడీని కదను తొక్కించడం ఆయనకే చెల్లింది. రేలంగి .. రమణా రెడ్డి .. రాజబాబు .. అల్లు .. వాళ్లంతా కూడా తెలుగు తెరపై హాస్యానికి వన్నె తెచ్చినవారే. అయితే బ్రహ్మానందం స్థాయిలో వైవిధ్యభరితమైన పాత్రలను ఎవరూ చేయలేదు. ఇన్నేళ్లు అవుతున్నా తెరపై ఆయన కనిపిస్తే ప్రేక్షకులకు పండగే .. నాన్ స్టాప్ సందడే.

అలాంటి బ్రహ్మానందం ఈ నెల 29వ తేదీన ప్రసారం కానున్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సందడి చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో రన్ అవుతోంది. ఆలీతో కలిసి ఆయన పంచుకున్న అనుభవాలు .. జ్ఞాపకాలు ఈ కార్యక్రమంపై మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. "తాను చాలా పెర్ఫెక్ట్ గా ఉన్నానంటూ చెప్పిన బ్రహ్మానందం, ఆలీతో కలిసి నవ్వుల పువ్వులు పూయించారు. "బ్రహ్మానందం పుట్టింది ఎక్కడ? .. పెరిగింది ఎక్కడ? .. చదివింది ఎక్కడ? .. సెటిల్ అయింది ఎక్కడ? అనే ఆలీ ప్రశ్నకి, 'ఎందుకురా అయన్నీ' అంటూ తనదైన మేనరిజంతో ఒక్క మాటలో తేల్చేశారు.

"ఈ రోజున తాను ఈ స్థాయిలో ఉండటానికీ .. అందరినీ నవ్వించే శక్తి తనలో ఉందని ముందుగా గ్రహించిన మహానుభావుడు జంధ్యాలగారు అని బ్రహ్మీ చెప్పారు. ఆ తరువాత నా బ్రతుకు అందరికీ తెలిసిందే అంటూ నవ్వేశారు. నేను ఈ స్థాయికి రావడాన్ని నా తల్లిదండ్రులు చూడలేదు. 'సత్తెనపల్లి' థియేటర్లో అటు అమ్మని .. ఇటు నాన్నని కూర్చోబెట్టి నా సినిమాలు చూపించేవాడిని. నా యాక్టింగ్ చూసి అందరూ నవ్వుతూ ఉండేవారు. మా నాన్నకి దూరం నుంచి కనిపించేది కాదు .. 'ఇంతమందిని ఎలా నవ్విస్తున్నావురా' అని ఆయన ఆశ్చర్యపోయేవారు. ఆ సంఘటన గుర్తుకు వస్తే .. అంటూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.

చిరంజీవికి గారికి జంధ్యాల గారే నన్ను పరిచయం చేశారు. ' తను కాలేజ్ లెక్చరర్ నని చెబుతాడు .. కానీ ఎంతవరకూ నిజమో మనకి తెలియదు' అని అన్నారు. అప్పుడు చిరంజీవిగారు "మీరు సినిమాల్లో యాక్ట్ చేయడమనేది నేను చూసుకుంటాను" అని చెప్పారు .. ఫస్టు టైమ్ నా లైఫ్ లో నేను ఫ్లైట్ ఎక్కింది ఆయనతోనే. ఫస్టు అవార్డును నేను దిలీప్ కుమార్ గారి నుంచి తీసుకున్నాను .. అప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు. ఎవరైనా సన్మానం చేస్తే .. ఆ రోజున ఇంటికి వచ్చి లుంగీ కట్టుకుని కిందనే పడుకుంటాను. ఇక ఈ జనరేషన్ నా 'మీమ్స్' ను క్రియేట్ చేయడం సంతోషాన్ని కలిగిస్తోంది. నేను సినిమాలు చేయడం తగ్గించినా అవి జనం మరిచిపోకుండా చేస్తున్నాయి" అని చెప్పుకొచ్చారు.