ఫ్రీగా నటిస్తానన్నా బ్రహ్మానందంమే కావలన్నారు

Mon Jan 17 2022 17:09:04 GMT+0530 (IST)

Brahmanandam In Rangamarthanda Movie

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణవంశీకి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఆయన ఏ సినిమా చేసినా తనకు నచ్చినట్టుగా చెక్కుతుంటారు. ఆ విషయంలో ఎవరు చెప్పినా రాజీపడరు. కథ బడ్జెట్ పాత్రల విషయంలోనూ కృష్ణవంశీ పంథా మారదు. బడ్జెట్ పెరిగినా సరే తను అనుకున్న విధంగా సినిమా రావాలంతే ఆ విషయంలో కాంప్రమైజ్ కారు. గత కొన్నేళ్లుగా సినిమాలకు బ్రేకిచ్చిన కృష్ణవంశీ తాజాగా `రంగమార్తాండ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.మరాఠీలో సంచలనం సృష్టించిన `నట సమ్రాట్` ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నానా పటేకర్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీపై సర్వత్రా ప్రశంసలు కురిసాయి. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలోని నానా పోషించిన పాత్రకు ఎంత పేరొచ్చిందో ఆయనకు సన్నిహితుడిగా నటించిన విక్రమ్ గోఖలేకి అంతే పేరొచ్చింది. కృష్ణవంశీ ఈ మూవీని రీమేక్ చేస్తున్నారని తెలియగానే నానా విక్రమ్ పాత్రల్లో ఎవరు నటిస్తారా? అనే చర్చ జరిగింది.

కృష్ణవంశీ అదృష్టం కొద్ది నానా పోషించిన పాత్రకు ప్రకాష్ రాజ్ లభించారు. అయితే సినిమాకు మరీ కీలకంగా నిలిచే విక్రమ గోఖలే పాత్రలో ఎవరు నటిస్తారన్నది ప్రధాన సమస్యగా మారింది. దీనిపై కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరిగింది కూడా. ఓ సీనియర్ నటుడు ఆ పాత్రలో ఫ్రీగా నటిస్తానని దర్శకుడు కృష్ణవంశీకి ఆఫర్ కూడా ఇచ్చారట. అయితే ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించి షాకిచ్చారట కృష్ణవంశీ.

ఏంటీ ఈయన ధైర్యం ఆ పాత్రలో నటించదగ్గ వారెవరున్నారని అంతా అనుకుంటుంటే ఆ పాత్రలో బ్రహ్మానందంని మాత్రమే ఊహించుకుంటున్నానని ఆయనే ఈ పాత్రలో నటిస్తారని చెప్పారట. అన్నట్టుగానే ఆ పాత్రకు బ్రహ్మానందంని ఫైనల్ చేసి షూటింగ్ కూడా చివరి దశకు తీసుకొచ్చారు. ట్రాజెడీ ఎండింగ్ తో ముగిసే ఈ పాత్రకు బ్రహ్మానందంని తీసుకోవడం కృష్ణవంశీ చేస్తున్న సాహసం అని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు `బాబాయ్ హోటల్` తరువాత సీరియస్ పాత్రల్లో నటించలేదు. పైగా ఆయన నటనకు కొంత విరామం కూడా ఇచ్చారు.

అంతే కాకుండా ఈ మూవీలో ఆయన గెడ్డంతో ఓల్డ్ గెటప్ లో కనిపించాలి. కానీ కృష్ణవంశీ మాత్రం ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా కీలక పాత్ర కోసం బ్రహ్మానందంని తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ తో కలిసి బ్రహ్మానందం నటించిన ఓ సీన్ లో ఆయన నటన చూసి భావోద్వేగానికి లోనయ్యారట కృష్ణవంశీ. అంటే కాకుండా ఆయన ఈ సినిమా అద్భుతంగా నటించారని మేము తెరవెనుక ఎంత కష్టపడినా క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్లిపోతుందని ప్రతీ ఒక్కరికీ చెబుతున్నారట. బ్రహ్మానందంపై కృష్ణవంశీ పెట్టుకున్న నమ్మకానికి ఇండస్ట్రీ వర్గాలు అవాక్కవుతున్నాయట.