Begin typing your search above and press return to search.

చిరంజీవి వలన ఎంత అదృష్టం పట్టిందో తెలుసా?

By:  Tupaki Desk   |   30 Nov 2021 9:30 AM GMT
చిరంజీవి వలన ఎంత అదృష్టం పట్టిందో తెలుసా?
X
తెలుగు సినిమా .. అది తీసుకున్న మలుపులు .. చెందిన మార్పులను గురించి ఎవరైనా ఒక పుస్తకం రాయాలనుకుంటే, చిరంజీవి పేరును ప్రస్తావించకుండా రాయలేరు. తెలుగు సినిమా చరిత్రలో ఆయనది ఒక కీలకమైన అధ్యాయం. అలాంటి చిరంజీవితో కలిసి బ్రహ్మానందం ఎన్నో సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరూ కలిసి చేసిన నవ్వుల సందడి అంతా ఇంతా కాదు. అలాంటి చిరంజీవితో తన పరిచయం గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. 'తాతావతారం' తరువాత జంధ్యాల గారి దర్శకత్వంలో 'సత్యాగ్రహం' అనే ఒక సినిమాను చేశాను.

ఆ సినిమాలో నేను .. గుండు హనుమంతరావు ఇద్దరం కూడా గుండు చేయించుకుని, ఒక విలన్ దగ్గర అసిస్టెంట్ గా కనిపిస్తాము. ఆ సినిమా రిలీజ్ కావడం చాలా సమస్య అయింది ఆ రోజుల్లో. ఆ సినిమాను రామానాయుడు గారు కూడా చూశారు. ఆ తరువాత ఆయన 'అహ నా పెళ్లంటా' సినిమాను నిర్మిస్తూ, కోట అసిస్టెంట్ గా సుత్తివేలును అనుకున్నారు. అప్పట్లో సుత్తివేలు ఫుల్ బిజీగా ఉండటం వలన ఆయన అందుబాటులోకి రాలేదు. అప్పుడు 'సత్యాగ్రహం' సినిమాలో నేను చేసిన పాత్ర గుర్తుకు రావడంతో నన్ను పెట్టుకోమని రామానాయుడుగారు చెప్పారు. అలా ఆ వేషం నాకు వచ్చింది.

ఆ తరువాత వైజాగ్ లో 'చంటబ్బాయ్' షూటింగు సమయంలో జంధ్యాలగారు నన్ను చిరంజీవికి పరిచయం చేశారు. ఆయన డాల్ఫీన్ హోటల్ కి రమ్మంటే వెళ్లి కలిశాను. నాకు తెలిసిన ఐటమ్స్ .. చేసిన ఐటమ్స్ అన్నీ ఆయనకి చూపించాను. ఆయన చాలా హ్యాపీగా ఫీలై '' నో నో మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు .. నాతో పాటు మద్రాస్ వచ్చేయండి .. మీరు ఎలా సినిమాల్లో చేయాలనేది నేను చూసుకుంటాను" అని చెప్పారు. ఫస్టు టైమ్ నా లైఫ్ లో నేను ఫ్లైట్ ఎక్కింది ఆయనతోనే.

అసలు చిరంజీవిని చూడటమనేదే గొప్ప విషయం .. అలాంటిది ఆయనతో మాట్లాడటం .. ఆయన నన్ను మరీ దగ్గరికి తీసుకోవడం .. ఆయనతో పాటు ఫ్లైట్ ఎక్కడం .. ఆయన నేరుగా నన్ను వాళ్లింటికి తీసుకెళ్లారు. ఆ తరువాత అందరికీ నన్ను పరిచయం చేశారు. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? అలా నా కెరియర్లో జంధ్యాలగారు .. రామానాయుడు గారు .. చిరంజీవిగారు ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఆ ముగ్గురికీ కూడా కృతజ్ఞతా పూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 'అహ నా పెళ్లంటా' సినిమా కోసం నేను బెస్ట్ కమెడియన్ అవార్డును అందుకున్నాను. సైరాభాను స్టేజ్ పై ఉండగా దిలీప్ కుమార్ చేత అవార్డును తీసుకోవడం నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పటికీ ఆ అవార్డును నా దగ్గర చాలా భద్రంగా దాచాను" అంటూ చెప్పుకొచ్చారు.