వరదలపై సెటైర్: దెబ్బకు ట్విట్టర్ నుంచి వైదొలిగిన నటుడు

Tue Oct 20 2020 18:30:42 GMT+0530 (IST)

Satire on floods: The actor who pulled out of Twitter due to the blow

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మజీ తన ట్విట్టర్ ఖాతా నుంచి వైదొలిగారు. అందులో నుంచి తన అకౌంట్ ను డిలీట్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు హైదరాబాద్ నగరంలో వినాశనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రహ్మజీ ఇల్లు కూడా వరదల్లో మునిగిపోయింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ లో తన ఇల్లు మునిగిందని.. వీధి అంతా నీటితో నిండిందని బ్రహ్మాజీ ట్విట్టర్ లో ఫొటోలు పోస్ట్ చేశారు. అంతేకాదు ‘తనకు ఒక పడవ కావాలని.. కొంటానని..ఎక్కడ ఉందో చెప్పాలని ’ జోక్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. ఈ ట్వీటే బ్రహ్మాజీ ట్విట్టర్ నుంచి నిష్క్రమించడానికి కారణం అని ప్రచారం సాగుతోంది.బ్రహ్మాజీ ట్వీట్టర్ లో అసలేమన్నాడంటే... “నేను.. నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చే సమయానికి మా ఇల్లు వరదలో మునిగి ఉంది.. ప్రవాహం ఎక్కువగా ఉంది.. కారులో వెళ్లడం సాధ్యం కాదని మేము భావించాము. అందువల్ల నేను సమీపంలోని అపార్ట్మెంట్ ప్రజలను అభ్యర్థించాను. నా కారును అక్కడ ఉంచాను. నేను.. నా భార్య అక్కడి నుండి ఇంటికి నడవాలని నిర్ణయించుకున్నాము. ప్రవాహం బలంగా ఉన్నందున కొంతమంది మా వద్దకు వచ్చి ఇంటికి చేరుకోవడానికి మాకు సహాయపడ్డారు. డ్రైనేజీలన్నీ నీటితో పొంగిపోతున్నాయి.. నేను ఒక పడవ కొనాలని ఆలోచిస్తున్నానని’ ఇలా ట్విట్టర్‌లో బ్రహ్మాజీ ఒక చిన్న జోక్ చేశాడు.

బ్రహ్మాజీ సరదాకు చేసిన ఈ ట్వీట్ వివాదాస్పదమైంది.కొందరు దీన్ని తప్పుగా సీరియస్ గా తీసుకున్నారు. ట్విట్టర్ లో బ్రహ్మాజీని తెలంగాణ ద్రోహి అని ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఈ మాత్రం దానికే ఎక్కువగా స్పందిస్తావా అంటూ తిట్ల వర్షం కురిపించారు.. చిన్న జోక్ కాస్త బూమరాంగ్ అయ్యి మొత్తం గందరగోళానికి దారితీసింది. ట్విట్టర్ లో ట్రోల్స్ కు తీవ్రంగా బాధపడిన బ్రహ్మజీ చివరకు తన ఖాతాను అందులోంచి తొలగించాలని నిర్ణయించుకున్నాడు.

నిజానికి బ్రహ్మజీ స్వచ్ఛమైన హైదరాబాదీ ఇక్కడ పుట్టి పెరిగాడు. అయినా ఆయనను ఆంధ్రా అంటూ నెటిజన్లు ఆడిపోసుకోవడంతో చాలా బాధపడి ఈ నిర్ణయం తీసుకున్నాడు. "నేను హైదరాబాద్ చెన్నై ఢిల్లీ బెంగళూరులో ఎక్కడ ఉన్నా సరే ఇలానే ట్వీట్ పెట్టేవాడిని.. ఇది కేవలం జోక్ మాత్రమే.. అపార్థం చేసుకోవద్దు" అని నెటిజన్లకు విజ్ఞప్తి చేశాడు.