Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ షాకింగ్‌..! ఏం జ‌ర‌గ‌బోతోంది?

By:  Tupaki Desk   |   24 Jan 2021 2:30 PM GMT
బాక్సాఫీస్ షాకింగ్‌..! ఏం జ‌ర‌గ‌బోతోంది?
X
క‌రోనా కొట్టిన దెబ్బ అన్ని రంగాల మీద ఒక‌టైతే.. సినీ ప‌రిశ్ర‌మ‌పై ప‌డింది మాత్రం రెండింత‌లు! లాక్ డౌన్ మొద‌లైంది.. ముగిసింది. ప్ర‌జ‌లు త‌మ డ్యూటీలో మునిగిపోయారు.. ప‌నులన్నీ య‌థావిధిగా సాగుతున్నాయి.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా మ‌ళ్లీ ప‌ట్టాలెక్కింది.. కానీ, సినిమా రీల్ మాత్రం స‌రిగా తిర‌గ‌ట్లేదు! ప్రొజెక్ట‌ర్ స‌రిగా ఫోక‌స్ చేయ‌లేక‌పోతోంది! ఫైన‌ల్ గా బొమ్మ స‌రిగా ప‌డ‌ట్లేదు. దీంతో.. నిర్మాత‌ల‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఈ విష‌యాన్ని లెక్క‌ల‌తో చాటి చెబుతున్నాయి. మ‌రి, ఇప్పుడేం చేయాలి?

థియేట‌ర్లు తెరుచుకున్నా..

లాక్ డౌన్ ముగిసిన చాలా కాలానికి థియేట‌ర్లు తెరుచుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. కానీ.. 50 శాతం ఆక్యుపెన్సీ అంటూ కండీష‌న్ అప్లై చేసింది. దీంతో.. సినిమా రిలీజ్ చేయాలా? వ‌ద్దా? అని నిర్మాత‌లు డైల‌మాలో ప‌డిపోయారు. రిలీజ్ చేస్తే 50 శాతం సీటింగ్ కెపాసిటీతో క‌లెక్ష‌న్స్ పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. విడుద‌ల చేయ‌క‌పోతే.. ఏనాడో తెచ్చిన అప్పులు కుప్ప‌లైపోతున్నాయి. ఏం చేయాలా? అని తీవ్రంగా మ‌ద‌న ప‌డిపోయారు ప్రొడ్యూస‌ర్స్‌. ఈ క్ర‌మంలో ధైర్యం చేసిన బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని క్రిస్మ‌స్ స‌మ‌యంలో రిలీజ్ చేశారు. యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ క‌లెక్ష‌న్లు మాత్రం కొల్ల‌గొట్ట లేక‌పోయింది.

పంచ‌తంత్రం..

సగం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత తెలుగులో రిలీజ్ అయిన చిత్రాలు మొత్తం ఐదు. ఇందులో విజ‌య్ మాస్ట‌ర్ డ‌బ్బింగ్ కోటాలోకి వెళ్లిపోతే.. తెలుగు స్ట్ర‌యిట్ చిత్రాలు నాలుగు. అందులో వ‌రుణ్ తేజ్ ‘ఎస్‌బీఎస్‌బీ’, రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ సినిమాలు ఉన్నాయి. ఇందులో నిర్మాత‌కు లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏదైనా ఉందంటే.. అతి మాస్ రాజా క్రాక్ మాత్ర‌మే. మిగిలిన సినిమాల‌న్నీ న‌ష్టాలే మిగిల్చాయి. థియేట్రిక‌ల్ ప‌రంగా నిర్మాత‌ల‌కు.. ఆ సినిమాల‌ను కొనుగోలు చేసిన బ‌య్య‌ర్ల‌కు తీవ్ర న‌ష్టాలు వ‌చ్చాయి. అయితే.. క్రాక్ సినిమా కూడా సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో వ‌చ్చింది కాబ‌ట్టి ప్రాఫిట్ లిస్టులోకి వెళ్లింది కానీ.. ఇత‌ర సంద‌ర్భాల్లో విడుద‌లైతే మాత్రం లెక్క‌లు మారిపోయేవంటున్నారు ట్రేడ్ పండితులు.

తేల్చి చెప్పిన చిత్రం..

సంక్రాంతి సీజ‌న్ అనేది సామాన్యుల‌కు మాత్ర‌మే కాదు.. సినీ జ‌నాల‌కు కూడా పెద్ద పండ‌గ‌. ఈ సీజ‌న్లో రిలీజ్ చేస్తే థియేట‌ర్లు క‌ళక‌ళ‌లాడుతుంటాయ‌ని, త‌ద్వారా బాక్సాఫీస్ గ‌ల‌గ‌ల‌లాడుతుంద‌ని నిర్మాత‌లు భావిస్తుంటారు. అది వాస్త‌వం కూడా. అందుకే.. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వ‌చ్చాయి. కానీ.. ఇందులో ఒకే ఒక చిత్రం మాత్ర‌మే లాభాలను టేస్ట్ చేసింది. మిగిలిన మూడు సినిమాలూ న‌ష్టాల‌నే రుచి చూశాయి. దీనికి.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోక‌పోవ‌డం ఒక కార‌ణ‌మైతే.. 50 శాతం ఆక్యుపెన్సీ రెండో కార‌ణం. అయితే.. సంక్రాంతి సీజ‌న్ త‌ర్వాత థియేట‌ర్ల ప‌రిస్థితి ఎలా ఉందో నిన్న విడుద‌లైన ‘బంగారు బుల్లోడు’ పిక్చ‌ర్ క్లియ‌ర్ చేసింది. క‌నీస వ‌సూళ్లు లేక ఈ మూవీ డ‌బుల్ డిజాస్ట‌ర్ అయింది.

ఆ నిర్మాత‌ల్లో గుబులు..

ఇప్ప‌టి వ‌ర‌కూ స్టోర్ రూంలో దాచిన చిత్రాల తాలూకు వ‌డ్డీ భారాల‌ను మోయ‌లేక.. ఏదైతే అది అయ్యిందంటూ ధైర్యం చేస్తున్నారు ప‌లువురు నిర్మాత‌లు. థియేట్రిక‌ల్ రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే.. అలాంటి వారిని ‘బంగారు బుల్లోడు’ సినిమా ఫ‌లితం ఠారెత్తిస్తోంది. ఈ మూవీ కలెక్షన్లు చూసిన ప్రొడ్యూసర్స్ గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. త్వరలో.. జాంబీ రెడ్డి, ఉప్పెన‌, పొగ‌రు, చెక్, శ‌శి సినిమాలు థియేటర్లకు క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మరి, వీటి ఫలితం ఎలా ఉంటుంది? క‌లెక్ష‌న్ ఎలా ఉంటాయ‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది మేక‌ర్స్ లో.

స్థాయికి మించిన‌వే..

ఇప్పుడు రిలీజ్ కాబోతున్న చిత్రాల్లో పేరున్న చిత్రం చెక్ మాత్ర‌మే. ఇందులో నితిన్ హీరోగా న‌టించాడు. ఆ మూవీ త‌ప్పితే.. మిగిలిన సినిమాల‌న్నీ హీరోల స్థాయికి మించిన బ‌డ్జెట్ తో రూపొందిన‌వే ఉన్నాయి. అలాంటి సినిమాలు హిట్ కొట్టి, 50 శాతం ఆక్యుపెన్సీ కోత‌ల‌ను అధిగ‌మించి, నిర్మాత గ‌ల్లాపెట్టె నిండాలంటే.. అందులో విష‌యం ఉండి తీరాల్సిందే. మ‌రి, ఆ విష‌యం ఎన్నిట్లో ఉంద‌న్న‌ది అనుమాన‌మే.

మ‌రి, ఏం చేయాలి?

సినిమా ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న గ‌డ్డు ప‌రిస్థితిని అధిగ‌మించాలంటే.. ఏకైక ప‌రిష్కారం 100 శాతం ఆక్యుపెన్సీ! సీటింగ్ కెపాసిటీ ఫుల్లుగా ఉన్న‌ప్పుడే.. ఒక సినిమా హిట్ కొట్టి, నిర్మాత‌ల‌కు లాభాలు తేవ‌డం గ‌గ‌నం. కేవ‌లం 2 నుంచి 5 శాతం స‌క్సెస్ రేట్ ఉన్న ఇండ‌స్ట్రీలో.. 50 శాతం ఆక్యుపెన్సీతో ఎలాంటి లాభాలు వ‌స్తాయో ఊహించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. కాబ‌ట్టి.. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి మిగిలి ఉన్న ఏకైక మార్గం పూర్తిస్థాయి ఆక్యుపెన్సీ మాత్ర‌మే. ఎలాగూ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా కొన‌సాగుతోంది. అంతేకాకుండా.. మెజారిటీ ప్ర‌జ‌లు మాస్క్ ప‌క్క‌న పెట్టి త‌మ ప‌నులు చేసుకుంటున్నారు. కాబ‌ట్టి.. థియేట‌ర్లో వంద శాతం టికెట్లు తెంచితే వ‌చ్చే ఇబ్బందులు పెద్ద‌గా ఏమీ ఉండ‌వ‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. మ‌రి, ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చూడాలి.