Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పై ఎల్లలులేని అభిమానం అంటే ఇదే!

By:  Tupaki Desk   |   2 Dec 2021 7:39 AM GMT
ఎన్టీఆర్ పై ఎల్లలులేని అభిమానం అంటే ఇదే!
X
తెలుగు సినిమా చరిత్రను గురించి రాయాలనుకుంటే అందులో ఎక్కువ పేజీలు ఎన్టీ రామారావువే ఉంటాయి. ఆయన పేరును ప్రస్తావించకుండా తెలుగు సినిమా చరిత్రను గురించి చెప్పుకోవడం అసాధ్యమే అవుతుంది. పల్లె ప్రజలకు రామాయణ .. భారత .. భాగవత విషయాల పట్ల ఒక అవగాహన కలగడానికి కారణం ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఆయన పౌరాణిక చిత్రాల ప్రభావం వాళ్లపై అంతగా ఉంది. శ్రీరాముడు .. శ్రీకృష్ణుడు ఎలా ఉంటారనేది ఎవరికీ తెలియదు. కానీ వాళ్ల పేర్లను ప్రస్తావించినప్పుడు ఎన్టీఆర్ రూపమే కళ్లముందు కదలాడుతుంది.

అందువల్లనే ఎన్టీఆర్ ను అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. తమ మనసులో ఆయనకి గల స్థానాన్ని ఎంతమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. తెలుగు తెర దేవుడిగా ఎన్టీఆర్ ను ఆరాధించే అభిమానులు, ఆయన పట్ల తమకి గల అభిమానాన్ని అనేక రకాలుగా చాటుకుంటూ ఉంటారు. అలా ఒక అభిమాని తన ఇంటికి 'తారకరామ నిలయం' అనే పేరు పెట్టుకోవడమే కాకుండా, తన ఇంటిని 'నటరత్న కళా మ్యూజియం'గా మార్చేశారు. ఆ వీరాభిమాని పేరు పుచ్చకాయల చంద్రమౌళి. కాకినాడలోని గంగరాజు నగర్ ఆయన నివాసం.

మూడు అంతస్తులుగా ఉన్న తన భవనంలో ఆయన మూడవ అంతస్తును ఎన్టీఆర్ మ్యూజియం కోసం కేటాయించారు. అక్కడ ప్రధానమైన ఆకర్షణగా ఆయన శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న 7 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాంఘిక .. చారిత్రక .. పౌరాణిక .. జానపద సినిమాలలో ఎన్టీఆర్ వేషధారణకి సంబంధించిన అనేక పోస్టర్లు .. చిత్రపటాలు .. ఆయన జీవితచరిత్రకి సంబంధించిన పుస్తకాలు ఈ మ్యూజియంలో కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జయంతి - వర్ధంతి సందర్భాలలో ఈ మ్యూజియం ఆయన అభిమానులతో కిటకిటలాడుతూ ఉంటుందట. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

చంద్రమౌళి మాట్లాడుతూ .. "చిన్నప్పుడు మా అమ్మానాన్నలు ఎన్టీ రామారావుగారి పౌరాణిక సినిమాలకు మాత్రమే మమ్మల్ని పంపించేవారు. రాజమండ్రి అశోక థియేటర్లో అన్నగారి సినిమాలు ఎక్కువగా వేసేవారు. నేను అక్కడే ఆయన సినిమాలను చూసేవాడిని. వినోదం .. సందేశం .. దేశభక్తి .. దైవభక్తితో కూడిన ఎన్టీఆర్ సినిమాలు ఆయన పట్ల నాకు గల అభిమానాన్ని పెంచుతూ వెళ్లాయి. పాత్రల పరంగా అప్పట్లోనే ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆయన సినిమా విడుదలైతే అభిమానులకు అది ఒక బ్రహ్మోత్సవం అన్నట్టుగా ఉండేది. ఆ అభిమానమే ఆయన మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగించింది" అని చెప్పుకొచ్చారు.